– ఓటు హక్కు తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
– అదనపు కలెక్టర్, ఆర్డీఓకు గ్రామ మాజీ సర్పంచ్ ఫిర్యాదు
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 02 : నల్లగొండ మండలంలోని చెన్నుగూడెం గ్రామంలో మొత్తం ఓటర్లు 575 ఉండగా అందులో ఉన్న నలుగురి ఎస్సీ ఓట్లు మాత్రం అధికారులు తొలగించారు. గ్రామం మొత్తంలో ఉన్న నాలుగు ఎస్సీ ఓట్లను తొలగించడం పట్ల గ్రామంలో చర్చనీయాంశమైంది. ఇదే విషయంపై చెన్నుగూడెం మాజీ సర్పంచ్ గుండెబోయిన శ్రీలత జంగయ్య యాదవ్ తో పాటు ఓట్లు తొలగించబడ్డ బాధితులు ఖమ్మం చిన్న ఇద్దయ్య, లక్ష్మమ్మ, సామెల్, శ్రీకాంత్ మంగళవారం అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తో పాటు, నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, తాసీల్దార్, ఎంపీడీఓలను కలిసి వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ గుండెబోయిన శ్రీలత జంగయ్య యాదవ్ మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా చెన్నుగూడెం గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా పని చేస్తున్న ఇద్దయ్య, అతని కుటుంబ సభ్యుల ఓట్లను, బడుపుల శ్రీకాంత్ ఓటును అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడంలో ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలోనూ వీరు దళిత బంధు ప్రొసీడింగ్ కాపీలు అందుకున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇతర అడ్రస్ ప్రూఫ్ లు మొత్తం గ్రామంలోనే ఉన్నట్లు చెప్పారు. గత ఎన్నికలలో గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న వీరి ఓట్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు.
గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ రాకుండా కుట్ర చేయడంతో పాటు, మల్టీపర్పస్ వర్కర్ గా పని చేస్తున్న ఇద్దయ్యను విధుల నుంచి తొలగించే కుట్రలో భాగంగానే అధికార పార్టీ నాయకులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. తొలగింపబడ్డ ఓటర్లకు చెన్నుగూడెం గ్రామంలో తప్పా ఎక్కడా కూడా ఓట్లు లేవన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించిన అధికారులపై ప్రజా ప్రతినిధ్యం చట్టం 1951 ప్రకారం చట్టారీత్యా చర్యలు తీసుకుని, తొలగింపబడ్డ ఓటర్లకు తిరిగి చెన్నుగూడెం గ్రామ పంచాయతీలోనే ఓటు హక్కు కల్పించాలని ఆయన కోరారు.