Tirumala | కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి (Venkateswara Swamy) సాలకట్ల బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఇందలో భాగంగా వెంకన్న రోజుకో వాహనంలో తిరుమల వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆరో రోజైన బుధవారం ఉదయం హనుమంత వాహనసేవ (Hanumantha Vahanam) నిర్వహించారు.
ఈ సందర్భంగా మలయప్ప స్వామి రాముని అవతారంలో మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా.. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవాళ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీమలయప్పస్వామివారు భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం, టీటీడీ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. భక్తులు వాహన సేవలను తిలకించి భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది.
వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని చూసి ఆధ్యాత్మిక తన్మయత్వం పొందారు. వెంకటగిరులన్నీ గోవిందనామస్మరణతో మార్మోగాయి. పెద్ద, చిన్నశేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై విహరించిన వేంకటేశుడు.. తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై భక్తులకు అభయప్రదానం చేశారు. మూలవరులకు అలంకరించే లక్ష్మీకాసులహారం, మకరకంఠి ఆభరణాలను మలయప్పస్వామికి అలంకరించారు. టీటీడీ తిరుమాఢ వీధుల్లోని గ్యాలరీల్లో దాదాపు 2 లక్షల మంది భక్తులు కూర్చునే అవకాశం కల్పించారు.
Also Read..
KTR | రాహుల్జీ.. మీకోసం అశోక్‌నగర్‌లో యూత్ ఎదురుచూస్తున్నారు.. కేటీఆర్ సెటైర్లు