Hydraa | హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): ‘మియాపూర్‌లో ఉన్న ఒక ఆకాశహర్మ్యం చెరువులో నిర్మితమైంది.. పుప్పాలగూడలో చెరువును ఆక్రమించి ఏకంగా ఐటీ టవర్ నిర్మాణం జరిగింది..’ ఇవేవో సామాన్యుడు చేస్తున్న ఆరోపణలు కాదు.. అధికారులు చేసిన హెచ్చరికలు అంతకన్నా కాదు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బహిరంగంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించిన వివరాలు. పదకొండు భారీ నిర్మాణ ప్రాజెక్టులు అక్రమమని ఆయన ఆరోపించారు. వాస్తవంగా ఈ 11 ప్రాజెక్టులు మాత్రమే చెరువుల్లో ఉన్నాయా? హైడ్రా వీటిని కూడా కూల్చేస్తుందా? లేదంటే ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందా? దాదాపు రూ.15 వేల కోట్లకుపైగా విలువైన ఈ నిర్మాణ ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకమేనా? కోట్లు గుమ్మరించి కొనుగోలు చేసినవారి పరిస్థితి ఏమిటి? అనే చర్చ సోషల్‌మీడియా వేదికగా నడుస్తున్నది. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న 11 బడా ప్రాజెక్టులు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించాయంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా ఒక నివేదికను విడుదలచేశారు. ఆయా నిర్మాణాలతో చెరువుల స్వరూపమే మారిందని, మనుగడలో లేకుండా పోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అధికారులు రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. 2014 తర్వాత నగరంలో చెరువుల పరివాహాక ప్రాంతాల్లో నిర్మాణాలు జోరుగా జరిగాయని పేర్కొన్నారు. దీంతో ఈ బడా నిర్మాణాల భవిత ప్రశ్నార్థకంగా మారింది. ఈ అంశమే ఇప్పుడు కొనుగోలుదారులను కలవరపెడుతున్నది.
చెరువుల ఎఫ్టీఎల్ హద్దులను చెరిపివేసి నిర్మాణాలు జరిగాయంటూ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 11 బడా నిర్మాణాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జాబితాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని సాండియర్ స్కైలైన్, మియాపూర్‌లోని వెర్టెక్స్ విరాట్, పుప్పాలగూడలోని సుమధుర పాలైస్ రాయల్, సైబర్ సిటీలోని ఒరియానా, నెక్నాంపూర్‌లోని పూజా మ్యాజిక్ బ్రీజ్, బండ్లగూడ జాగీర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ బౌల్డర్ వుడ్స్, గోపన్‌పల్లిలోని వజ్రం ఇగ్జోరా, హానర్ సిగ్నాటిస్, పుప్పాలగూడలోని ఫోనిక్స్ 285 కమర్షియల్ బిల్డింగ్, ఫోనిక్స్ 25, వైష్ణవి సింబల్ వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టులను సమీపంలో ఉండే చెరువులు, కుంటలను ఆక్రమించి, నిర్మాణాలు చేపట్టారనేది ఆరోపణ.
చెరువులు, కుంటల పరిరక్షణతో సంబంధం లేకుండా కొన్ని ప్రాజెక్టులను ఎంపిక చేసుకుని భట్టి చేసిన వ్యాఖ్యలు వాటి కొనుగోలుదారులను కలవరపెడుతున్నాయి. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మించిన ప్రాజెక్టులన్నీ ఆక్రమణలేనని డిప్యూటీ సీఎం స్పష్టంచేయడంతో వాటిని కొనుగోలుచేసినవారికి హైడ్రా గుబులు పట్టుకున్నది. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ప్రాజెక్టులను ప్రభుత్వం ఏం చేయబోతున్నది? ఆక్రమణలుగా గుర్తించిన ఈ ప్రాజెక్టులను కూల్చివేస్తారా? క్రమబద్ధీకరణ చేస్తారా? లేదా ఆయా బిల్డర్లు, నిర్మాణదారులను భయపెట్టి ప్రయోజనం పొందాలని చూస్తున్నారా? అనే ప్రశ్నలు సొంత పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారాయి.
ఎఫ్టీఎల్ భూముల్లో ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ 11 ప్రాజెక్టుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.15 వేల కోట్లపైనే ఉంటుంది. ఇందులో కమర్షియల్ ఐటీ పార్కులతోపాటు రెసిడెన్షియల్, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ భవన నిర్మాణ అనుమతులతోపాటు రెరా ఆమోదం తెలిపిన ప్రాజెక్టులే కావడం గమనార్హం.
నార్సింగి జంక్షన్‌కు సమీపంలోని పుప్పాలగూడలో సాండియార్ స్కైలైన్ విల్లా నగరంలోనే అత్యంత ఎత్తయిన ప్రాజెక్టుల్లో ఒకటి. 59 అంతస్తులు ఉండే నాలుగు భారీ టవర్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఐటీ కారిడార్ కేంద్రంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఖరీదు సుమారు రూ.1,050 కోట్లు. ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది.
మియాపూర్ రామసముద్రం కుంట సమీపంలో చేపట్టిన వెర్టెక్స్ విరాట్ ప్రాజెక్టును ఎనిమిది ఎకరాలకుపైగా విస్తీర్ణంలో చేపట్టారు. ఈ ప్రాజెక్టులో 1,428 యూనిట్లను ఆరు స్కై స్క్రాపర్లతో సుమారు రూ.1,005 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం చెరువు భూముల్లోనే నిర్మిస్తున్నారని నివేదిక పేర్కొన్నది.
పుప్పాలగూడ ఖాజాగూడ సమీపంలో సుమధుర పాలైస్ రాయల్‌ను ఏడు ఎకరాల్లో 52 అంతస్తుల భారీ రెసిడెన్షియల్ టవర్‌ను దాదాపు రూ.215 కోట్లతో నిర్మించారు. దీనిని కూడా చెరువులను ఆక్రమించి నిర్మించారనేది ఆరోపణ.
మూసాపేటలోని సేవాలాల్నగర్లో సైబర్‌సిటీ ఒరియానా పేరిట 28 అంతస్తుల భారీ భవంతులను నిర్మిస్తున్నారు. ఒక్కో ఫ్లోర్‌కు 10 ఫ్లాట్ల చొప్పున నిర్మిస్తున్నారు. దీని విలువ దాదాపు రూ.820 కోట్లు. దీనిని మూడు టవర్లతో నిర్మిస్తుండగా, ఇందులో ఒక టవర్ పూర్తిగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు గుర్తించారు.
నెక్నాంపూర్ సమీపంలో అల్కాపూర్ టౌన్షిప్లో మ్యాజిక్బ్రీజ్ పేరిట 3.8 ఎకరాల విస్తీర్ణంలో 11 అంతస్తుల్లో భారీ ప్రాజెక్టును చేపట్టారు. దీని విలువ రూ.350 కోట్ల పైమాటే. డిప్యూటీ సీఎం విడుదల చేసిన నివేదిక ప్రకారం దీనిని కూడా సమీపంలో ఉండే కుంటను ఆక్రమించి నిర్మాణం చేపట్టారు.
బండ్లగూడ జాగీర్‌లోని ఎస్ఎంఆర్ బౌల్డర్ వుడ్స్ ప్రాజెక్టును 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందులో 583 ఫ్లాట్లు ఉంటాయి. దీనిని దాదాపు రూ.470 కోట్లతో రెండు భారీ టవర్లతో నిర్మిస్తున్నారు. ఇందులో ఎత్తయిన టవర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నది.
గోపన్‌పల్లి నుంచి నల్లగండ్ల వెళ్లే మార్గం లో వజ్రం ఇగ్జోరా పేరిట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో కూడిన మూడు భారీ టవర్లను నిర్మిస్తున్నారు. 368 కుటుంబాలు నివాసం ఉండే ఈ ప్రాజెక్టు ఖరీదు రూ.370 కోట్లు. దీనిని కూడా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మిస్తున్నట్టు నివేదిక తెలిపింది.
కూకట్పల్లి నుంచి హైటెక్‌సిటీ వెళ్లే మార్గంలో హానర్ సిగ్నాటిస్ ప్రాజెక్టును సుమారు రూ.800 కోట్లతో 25 అంతస్తులు ఉండే 18 టవర్లను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో కొంత భాగంగా ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది.
పుప్పాలగూడ కేంద్రంగా ఫోనిక్స్ సంస్థ 57 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద కమర్షియల్ సెజ్ పార్క్‌ను ఆరు టవర్లలో నిర్మిస్తున్నారు. దీని విలువ రూ.3,900 కోట్ల పైమాటే. ఈ ప్రాజెక్టు మొత్తాన్ని ఎఫ్‌టీఎల్‌లోనే నిర్మిస్తున్నట్టు నివేదించారు. అదే సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ఫోనిక్స్ ట్రైటాన్ ప్రాజెక్టును 19.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నది. దీని మొత్తం విలువ రూ.1,420 కోట్లు. అయితే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా చెరువుల భూముల్లోనే నిర్మించినట్టు గుర్తించారు.
గచ్చిబౌలిలోని వైష్ణవి సింబల్ ఐటీ కమర్షియల్ పార్క్ విలువ రూ.600 కోట్లు ఉండగా ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు.