(Cheating) గుంటూరు : పెండ్లి పేరుతో ఓ మహిళ ఘోరంగా మోసపోయింది. పెండ్లి చేసుకోకుండానే లోబర్చుకోవడం, తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోగా ముఖం చాటేయడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ ఆరా తీయగా.. తనను మోసం చేసినట్లు తేలింది. మోసపోయానని గ్రహించిన బాధిత మహిళ తెనాలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తెనాలి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. కాగా, ఈ కేసులో ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. వీరు గతంలోనూ పలువురిని ఇలాగే మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన ఒక మహిళ బ్యాంకు ఉద్యోగి. రెండో వివాహం నిమిత్తం తన ప్రోపైల్ను ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో రిజిష్టర్ చేసుకున్నది. ఇది చూసిన కార్తీక్ అనే వ్యక్తి సదరు మహిళకు ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తమది గుంటూరు జిల్లా తెనాలి అని, ప్రస్తుతం చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. దాంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. రోజు చాటింగ్ చేసుకోవటం, మాట్లాడుకోవటం కొనసాగించారు. ఈక్రమంలో ఆమెను కలిసిన కార్తీక్.. మాయ మాటలతో లోబర్చుకున్నాడు. పెద్దలతో మాట్లాడి త్వరలో పెండ్లి చేసుకుందామని నమ్మకం కల్గించాడు.
ఇలాఉండగా, తన కుటుంబానికి చెందిన ఆస్తులు నోట్ల రద్దు సమయంలో అమ్మేశామని, అప్పుడు వచ్చిన కోట్ల రూపాయల నగదు బ్యాంకులో ఉన్నదని, వాటికి లెక్కలు చెప్పాలని ఐటీ అధికారులు ఆ డబ్బు సీజ్ చేశారని నమ్మించాడు. ఆ మొత్తాన్ని విడిపించేందుకు ఐటీ అధికారులుకు కొంత చెల్లించాల్సి ఉంటుందని చెప్పి అప్పుగా ఇవ్వమని ఆమెను కోరాడు. దాంతో ఆ మహిళ తన వద్ద ఉన్న డబ్బుతో పాటు తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి మొత్తం రూ.32 లక్షలు కార్తీక్ మేనత్త అకౌంట్‌కు పంపింది.
అయితే, రోజులు గడుస్తున్నా డబ్బుల ఊసెత్తకపోవడం, పెండ్లి మాటను దాటవేస్తుండటంతో కార్తీక్‌పై అనుమానం వేసింది. తెనాలి వెళ్లి విచారించగా అసలు విషయం బయట పడింది. కార్తీక్ అసలు పేరు మహారాజ్ జానీరెక్స్ అనీ, అతడికి అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్నది. కార్తీక్ మేనత్తగా పరిచయం చేసిన మహిళ జానీరెక్స్ భార్య మహారాజ్ ప్రియ అని పోలీసులు గుర్తించారు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న జానీరెక్స్ అలియాస్ కార్తీక్‌ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
చరిత్రలో ఈరోజు : చందమామపై పరిశోధనలో భారత్ సువర్ణధ్యాయం
షుగర్‌ను ఇలా అదుపులో పెట్టుకోవాలి..! ఇవాళ వరల్డ్ డయాబెటిస్ డే
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..