వాషింగ్టన్, ఫిబ్రవరి 24 : తన ఆదేశాలతో అనేక దేశాల్ని భయపెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రాణభయం పట్టుకుంది. తనపై జరుగుతున్న వరుస హత్యాయత్నాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనను హత్య చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తాను ఎంతకాలం ఉంటానో తెలియట్లేదన్నారు.
ఇటీవల ఫ్లోరిడాలోని తన నివాసంలోకి ఓ సాయుధ దుండగుడు చొరబడిన ఘటనపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి షూటర్లు సాధారణ అధ్యక్షుల జోలికి వెళ్లరని, అసాధారణ విజయాలు సాధించే అధ్యక్షులనే టార్గెట్ చేసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్, జాన్ ఎఫ్.కెన్నడీ హత్య ఘటనలను ఉదహరించారు.