e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home Top Slides ఉపాధిగానూ.. వర్మీ కంపోస్టు!

ఉపాధిగానూ.. వర్మీ కంపోస్టు!

ఉపాధిగానూ.. వర్మీ కంపోస్టు!

అత్యుత్తమ సేంద్రియ ఎరువు వర్మీ కంపోస్టు. ఒకప్పుడు భూమిలో సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండేది. వానపాముల సంచారం అధికంగా కనిపించేది. దీంతో నేల సారవంతమయ్యేది.రసాయన ఎరువుల మితిమీరిన వాడకం వల్ల మట్టికి ఆ ప్రయోజనాలు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలోవ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడతో వర్మీ కంపోస్టుతయారు చేసి పంటలకు అందిస్తే మంచి ఫలితాలనుసాధించవచ్చు. నేరుగా పశువుల ఎరువు వాడితే, దీనిలోని పోషకాలు మొక్కలకు అందడానికి రెండుమూడు నెలల సమయం పడుతుంది. అదే వర్మీ కంపోస్టుద్వారా అయితే, నేరుగా అందించవచ్చు. దీని తయారీనికుటీర పరిశ్రమగా చేపట్టి, నిరుద్యోగ యువత ఉపాధిని పొందుతున్నది. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో దీనిపై శిక్షణకూడా తీసుకోవచ్చు.

సేంద్రియ ఎరువులు అన్నిటిలోకి వర్మీ కంపోస్టులో పోషక విలువలు అధికం. అంతేకాదు, మొక్కలకు కావలసిన ఎంజైములు, హార్మోన్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆక్సినోమైట్‌లను అధికంగా కలిగి ఉండటం వల్ల పంట ఆరోగ్యంగా పెరుగుతుంది. రైతుకు పురుగు మందుల అవసరాన్ని తగ్గిస్తుంది. దీన్ని నేలకు అందించటం వల్ల నేలలో సూక్ష్మజీవుల వృద్ధి వేగంగా ఉంటుంది. ఫలితంగా భూసారం పెరుగుతుంది. అందుకే, వర్మీ కంపోస్టును ‘జీవనాగలి’ అంటారు. వానపాములను ‘రైతుమిత్రులు’గా వ్యవహరిస్తారు. ఒక టన్ను వర్మీ కంపోస్టులోని పోషక విలువలను గమనిస్తే, 15 నుండి 30 కిలోల నత్రజని, 10 నుండి 20 కిలోల భాస్వరం, 11 నుండి 18 కిలోల పొటాషియం లభిస్తుంది. సూక్ష్మపోషకాలను కూడా తగిన మోతాదులో మొక్కలకు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పాడి పశువులు ఉన్న రైతులు చిన్న షెడ్‌ను నిర్మించుకొని, స్వయంగా వర్మీ కంపోస్టు తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో గిరాకీ పెరుగుతుండటంతో యువత వర్మీ కంపోస్టు తయారీని ఉపాధి అవకాశంగా మలుచుకొంటున్నారు. ప్రస్తుతం కిలో వర్మీ కంపోస్టు 7 నుండి 8 రూపాయల ధర పలుకుతున్నది. చక్కటి ప్యాకింగ్‌తో పట్టణాల్లో కిలో 20 రూపాయలకు అమ్ముతున్నారు.

- Advertisement -

గ్రామీణాభివృద్ధి సంస్థలో శిక్షణ
హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో గత 10 సంవత్సరాలుగా వర్మీ కంపోస్టు తయారీపై శిక్షణ ఇస్తున్నారు. దీనికోసం ఇక్కడ మోడల్‌ ఫామ్‌ను తీర్చిదిద్దారు. ఈ యునిట్‌నుండి ఏడాదికి ఏడుసార్లు ఉత్పత్తి జరుగుతున్నది. వ్యవసాయ వ్యర్థాలను, పేడను తయారీకి ఉపయోగిస్తున్నారు. ఒకసారి బెడ్‌ నింపితే 45 రోజులకు ఎరువు తయారవుతుంది. పెద్ద షెడ్లతోపాటు రైతులు స్వయంగా తయారు చేసుకునేందుకు వీలుగా 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో చిన్న షెడ్లను తక్కువ ఖర్చుతో నిర్మించి, దీన్ని ఒక మోడల్‌గా తీర్చిదిద్దారు. వీటిలో మూడు బెడ్లు వస్తాయి. ప్రతి బెడ్‌కు 3 కిలోల వానపాములు వదులుకుంటే, సంవత్సరం పొడవునా వర్మీ కంపోస్టు ఉత్పత్తి చేయవచ్చు. ప్రతిసారీ 400 కిలోల వర్మీ కంపోస్టు వస్తుంది. శాశ్వత బెడ్లు ఏర్పాటు చేయకుండా ‘గడ్డపల్లి కృషి విజ్ఞాన కేంద్రం’ వారు అభివృద్ధి చేసిన ఓపెన్‌ బెడ్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. రైతులు లేదా నిరుద్యోగ గ్రామీణ యువత వర్మీ కంపోస్టు యూనిట్‌లను చక్కటి ఉపాధి అవకాశంగా మార్చుకోవచ్చు.

షెడ్డు నిర్మాణం ఇలా
100 X 30 అడుగుల షెడ్డును శాశ్వత వనరులతో నిర్మిస్తే రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ ఖర్చును మొదటి సంవత్సరంలోనే రాబట్టుకోవచ్చు. ఏ విధంగా చేసుకున్నా అటు రైతుకు, ఇటు నిరుద్యోగ యువతకు ఈ యూనిట్ల ద్వారా చక్కటి ఉపాధి లభిస్తుందనటంలో సందేహం లేదు. వర్మీ కంపోస్టు తయారీ విధానం ఇలా ఉంటుంది… వ్యవసాయ వ్యర్థాలపై వేస్ట్‌ డీకంపోజర్‌ ద్రావణం చల్లి, 30 రోజులపాటు నిల్వ ఉంచాలి. వర్మీ కంపోస్టు తయారీలో బెడ్‌ సైజు 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు, 20-25 అడుగుల పొడవు ఉండాలి. బెడ్‌లో 1 మీటరుకు 1-2 కిలోల వానపాములు వదలాలి. మొదటిసారి 45 – 60 రోజుల్లో వర్మీ కంపోస్టు తయారవుతుంది. చీమలు చేరకుండా బెడ్లచుట్టూ బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లాలి. 10 X 10 అడుగుల స్థలంలో చిన్న షెడ్డు నుంచి ఏడాదికి లాభం రూ. 25-30 వేలు సంపాదించుకోవచ్చు.

తక్కువ ఖర్చుతో నిర్మించుకోవాలి
షెడ్లను సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో నిర్మించుకోవాలి. సూర్యరశ్మికి వ్యతిరేక దిశలో ఏర్పాటు చేసుకుంటే, వెలుతురు నేరుగా బెడ్‌లపై పడదు. దీంతో వానపాములపై ఒత్తిడి ఉండదు. 100 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో షెడ్లు నిర్మించుకొని దీన్ని రెండు భాగాలుగా విభజిస్తే, 25 నుండి 30 అడుగుల పొడవున్న ఎనిమిది బెడ్లు వేసుకునే వీలుంటుంది. వీటిద్వారా నెలకు 10-12 టన్నుల వర్మీ కంపోస్టు ఉత్పత్తి చేయవచ్చు. ఓపెన్‌ బెడ్‌ సిస్టంలో వర్మీ కంపోస్టు తయారీ చాలా సులభం. ఖర్చుకూడా తక్కువే. వానపాముల సంచారానికి అనువైన వాతావరణం కల్పిస్తే చాలు. ప్లాస్టిక్‌ పదార్థాలు, గాజుముక్కలు కంపోస్టులో లేకుండా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. వర్మీ కంపోస్టులో కొన్ని వందల రకాలున్నా మూడు, నాలుగు రకాలు మాత్రమే కంపోస్టు తయారీకి అనుకూలం. రమేష్‌ శక్తివేల్‌, హెడ్‌, ఆర్‌.టి.పి

తయారీలో రకాలు
కంపోస్టు తయారీలో నేలకు బొరియలు చేయని వానపాము రకాలను ఎంచుకోవాలి. వీటి జీవితకాలం రెండున్నర సంవత్సరాలు. పునరుత్పత్తి సామర్థ్యం అధికంగా ఉండటం వల్ల వానపాముల సంతతి వేగంగా వృద్ధి చెందుతుంది. ఇవి 90 శాతం వ్యర్థ పదార్థాలను, 10 శాతం మట్టిని ఆహారంగా తీసుకొని నాణ్యమైన కంపోస్టును ఉత్పత్తి చేస్తాయి. తయారైన వర్మీ కంపోస్టు నల్లగా ఉంటుంది. ఈ సమయంలో ఎరువును కుప్పలు, కుప్పలుగా పైకి ఎగదోసి రెండు గంటలపాటు నిల్వ ఉంచాలి. దీనివల్ల వానపాములు కిందకు వెళ్లిపోతాయి. సాధారణంగా నెలరోజులు నిల్వ చేసిన 2 టన్నుల పేడనుంచి 1 టన్ను వర్మీ కంపోస్టు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం టన్ను పేడ 1,500 రూపాయల వరకూ ఉంది. అంటే, రూ.3 వేలు ఖర్చవుతుంది. కూలీలు, ఇతర ఖర్చులు కలుపుకొంటే మరో వెయ్యి రూపాయిలు. అంటే మొత్తం రూ.4 వేలు ఖర్చవుతుంది. టన్ను వర్మీ కంపోస్టును రూ. 8 వేలకు విక్రయిస్తే 50 శాతం లాభం. దాదాపు రూ. 4,000 మిగులుతుంది. నెలకు 10 టన్నుల వర్మీ ఉత్పత్తి చేసే రైతు, రూ. 40 వేల వరకు లాభం పొందవచ్చు. బెడ్‌లలో అదనంగా వృద్ధి చెందిన వానపాములద్వారా కొంత అదనపు ఆదాయం వస్తుంది. శేఖర్‌, ప్రొఫెషనల్‌, ఎన్‌.ఐ.ఆర్‌.డి

… మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉపాధిగానూ.. వర్మీ కంపోస్టు!
ఉపాధిగానూ.. వర్మీ కంపోస్టు!
ఉపాధిగానూ.. వర్మీ కంపోస్టు!

ట్రెండింగ్‌

Advertisement