బుధవారం 30 సెప్టెంబర్ 2020
Agriculture - Aug 26, 2020 , 23:12:18

రైతు కంపెనీలుకర్షకుల కల్పతరువులు

రైతు కంపెనీలుకర్షకుల కల్పతరువులు

అన్నదాతే ఓ కంపెనీకి అధిపతి అయితే! తన పంటను తానే అమ్ముకునే వీలుంటే! ఇది వినడానికి కొత్తగా ఉన్నా, ఆచరణలోకి వస్తే మాత్రం అద్భుతమే! అలాంటి ఎన్నో అద్భుతాలు సృష్టించే పథకమే.. ‘ఎఫ్‌పీవో’ (ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈ విప్లవాత్మక నిర్ణయం.. కర్షకులకు కల్పతరువుగా మారుతున్నది. రైతులే స్వయంగా కంపెనీని ఏర్పాటు చేసుకొని.. వ్యవసాయాన్ని పండుగలా చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఏఏ పంటలు వేయాలి..? వాటిని ఎంత ధరకు..? ఎలా అమ్మాలి..? అనే నిర్ణయం కూడా రైతు చేతుల్లోనే ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీ పథకాల వినియోగం, బ్యాంకు రుణాలవంటి అనేక అంశాల్లోనూ అన్నదాతలకు అండగా నిలుస్తుంది. 

అనేక మంది రైతుల పరిస్థితి ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా ఉన్నది. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్నా, పంటలు వేయాలన్నా.. వాటిని అమ్ముకోవాలన్నా.. ఇలా వ్యవసాయానికి సంబంధించి ఎలాంటి పని అయినా, రైతు ఒంటరిగానే చేసుకుంటున్నాడు. దీంతో అన్నదాత అనేక విధాలుగా నష్టపోతున్నాడు. ఈ నష్టాలకు.. కష్టాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పథకమే ‘ఎఫ్‌పీవో’ లేదా ‘ఎఫ్‌పీసీ’ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ లేదా కంపెనీ). ఇవి రైతులందర్నీ ఒకే మాట.. ఒకే బాట మాదిరిగా ఏకతాటిపైకి తీసుకొస్తున్నాయి. గతంలో మాదిరిగా రైతులను నష్టాల ఊబిలో పడకుండా.. లాభాల బాటలో నడిపిస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఒక గ్రామం లేదా ఒక ప్రాంతంలోని రైతులంతా కలిసి సొంతంగా కంపెనీని స్థాపించుకునే అవకాశం ఉన్నది. సదరు కంపెనీ ద్వారానే పంటలను మంచి ధరకు అమ్ముకోవడం, తక్కువ ధరకే విత్తనాలు, ఎరువులు పొందే వీలు కలుగుతుంది. ఎఫ్‌పీవోల ఏర్పాటుతోపాటు, నిర్వహణ కోసం కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ముఖ్యంగా నాబార్డ్‌ ద్వారా అన్నదాతకు ఆర్థిక భరోసా అందుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 330 ఎఫ్‌పీవోలు ఉన్నాయి. వీటిలో 65,457 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. అందులో 16,034 మంది మహిళలే కావడం విశేషం. ఎఫ్‌పీవోల్లో సభ్యులైన రైతుల్లో 82శాతం మంది సన్న, చిన్నకారు రైతులే కావడం గమనార్హం. 

రైతులే యజమానులు..


ఎఫ్‌పీవోలలో రైతులే యజమానులుగా ఉంటారు. ఒక ప్రైవేటు కంపెనీ మాదిరిగానే ఎఫ్‌పీవోలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మొదట కొంత మంది రైతులు కలిసి కంపెనీ ఏర్పాటు కోసం నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత ఒక సీఈవోను, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ను ఎన్నుకోవాలి. వీరి ద్వారా ‘కంపెనీస్‌ యాక్ట్‌-2013’ ప్రకారం ప్రొడ్యూసర్‌ కంపెనీగా రిజిస్ట్రర్‌ చేయించుకోవాలి. ఇందుకు సంబంధించిన వివరాల కోసం జిల్లాలోని నాబార్డ్‌కు చెందిన డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ మేనేజర్‌(డీడీఎం)ను సంప్రదించాలి. కంపెనీ ఏర్పాటుకు రూ.30వేల నుంచి రూ.50వేల దాకా ఖర్చు అవుతుంది. ఎఫ్‌పీవోలో ఒక సీఈవోతోపాటు సభ్యుల సంఖ్యను బట్టి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఉంటారు. కంపెనీలో సభ్యులైన రైతుల నుంచే బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ను ఎన్నుకుంటారు. వారే కంపెనీని నడపగలిగే సామర్థ్యం గల వ్యక్తిని సీఈవోగా నియమిస్తారు. వీరిలో ఒక్క సీఈవోకు మాత్రమే ప్రతి నెలా వేతనం ఉంటుంది. 

షేర్ల అమ్మకంతో సభ్యత్వం..

కంపెనీలో సభ్యులుగా చేరాలనుకునే రైతులు, కంపెనీ షేర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో షేర్‌కు కొంత ధర నిర్ణయిస్తారు. దాని ప్రకారం రైతులంతా సమాన స్థాయిలో షేర్లను కొనుగోలు చేయాలి. దీని ద్వారా వచ్చిన డబ్బుతోనే కంపెనీని నడిపిస్తారు. రాష్ట్రంలోని ఎఫ్‌పీవోలలో విజయవంతమైన ‘జహీరాబాద్‌ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ’లో ఒక్కో షేర్‌ ధర రూ. 10 చొప్పున నిర్ణయించారు. ప్రతి రైతూ రూ. వెయ్యి వెచ్చించి వంద షేర్లను కొనుగోలు చేశారు. ఈ కంపెనీలో వెయ్యి మంది రైతులు సభ్యులుగా ఉండగా, వీరు కొనుగోలు చేసిన షేర్ల ద్వారా కంపెనీలో రూ. 10 లక్షల నగదు జమ అయింది. ఈ నిధి ద్వారానే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఎంతో మార్పు వచ్చింది..:  

ఎఫ్‌పీవో ఏర్పాటు చేయకముందు తామంతా ఎవరికి వారే అనే విధంగా ఉండేవాళ్లం. కానీ ఇప్పుడు ఎఫ్‌పీవోతో తామంతా ఒకే తాటిపైకి వచ్చాం. వ్యవసాయ విధానం పూర్తిగా మారిపోయింది. డిమాండ్‌ ఉన్న పంటలనే పండిస్తున్నాం. ఆర్థికంగా లాభాలు పొందుతున్నాం. పంటల అమ్మకం, ఎరువులు, విత్తనాలు కొనుగోళ్లలో ఎలాంటి సమస్య ఉండడం లేదు. 

శివన్న, రైతు, జహీరాబాద్‌ ఎఫ్‌పీవో డైరెక్టర్‌

జహీరాబాద్‌ ఎఫ్‌పీవో సక్సెస్‌...


జహీరాబాద్‌ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీని 2016లో కేవలం 10 మంది సభ్యులతో ప్రారంభించారు. ఇప్పుడు అందులో ఏకంగా 1300 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఎఫ్‌పీవో కార్యక్రమాలు మెచ్చిన కేంద్రం, 2018లో జాతీయ అవార్డును కూడా అందించింది. ఈ సంస్థ ద్వారా మొదట్లో ఫర్టిలైజర్‌, విత్తనాల అమ్మకం వ్యాపారం చేశారు. నేరుగా మార్క్‌ఫెడ్‌ నుంచి కొనుగోలు చేసి, మార్కెట్‌ ధర కన్నా తక్కువ రేటుకే రైతులకు విక్రయించారు. తద్వారా రైతుకు తక్కువ ధరకు ఎరువులు రావడంతోపాటు కంపెనీకి కూడా లాభాలు వచ్చాయి. రైతులంతా ఒకేతాటిపై ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం, సబ్సిడీలను సద్వినియోగం చేసుకున్నారు. తొలి మూడు సంవత్సరాలకు నాబార్డ్‌ రూ. 9లక్షల ఆర్థిక సాయం చేసింది. ఇక మార్క్‌ఫెడ్‌తో సమన్వయం చేసుకొని స్థానిక రైతుల నుంచి పంటలను ఎఫ్‌పీవో ద్వారానే కొనుగోలు చేశారు. 

ఈ విధంగా సుమారు రూ.7 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించారు. దీని వల్ల రైతులకు మద్దతు దక్కడంతోపాటు ఎఫ్‌పీవోకు ఒక శాతం కమీషన్‌ అంటే సుమారు రూ. 7లక్షల ఆదాయం సమకూరింది. ఒక గతేడాది ఇక్కడ సోయాబీన్‌ ధర తక్కువగా ఉండటంతో ఎఫ్‌పీవో కల్పించుకొని, మహారాష్ట్ర కంపెనీతో మాట్లాడింది. మద్దతు ధర కన్నా ఎక్కువకు కొనుగోలు చేయించింది. దీంతో నష్టపోవాల్సిన రైతులు, మంచి లాభాలతో గట్టెక్కారు. ఇప్పుడు ఎఫ్‌పీవో తరఫున ఒక కోల్డ్‌ స్టోరేజీని, పప్పు మిల్లును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా సిద్ధంగానే ఉన్నాయి. ఎఫ్‌పీవో ఏర్పాటు తర్వాత అక్కడి రైతులు నష్టాలను అధిగమించి, లాభాల బాటలో పయనిస్తున్నారు. 

నాబార్డ్‌ నుంచి పూర్తి సహకారం: 

దేశవ్యాప్తంగా ఎఫ్‌పీవోల ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే మా సంస్థ నుంచి కూడా పూర్తిగా సహకరిస్తున్నాం. తెలంగాణలో ఇప్పటి వరకు 330 ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయగా, వాటికి రూ. 34.69 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాం. భవిష్యత్‌లోనూ ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం.

 వై.కె. రావు, నాబార్డ్‌ తెలంగాణ సీజీఎం 

రైతులకు ఎంతో ఉపయోగం...:  ఎఫ్‌పీవోలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయి. మా ఎన్జీవో ద్వారా ఏర్పాటు చేసిన జహీరాబాద్‌ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ విజయవంతంగా దూసుకెళ్తున్నది. స్థానిక రైతులను లాభాల బాట పట్టించింది. రైతులే స్వయంగా పంటలు విక్రయించే స్థాయికి ఎదిగారు. ఆర్థికంగానూ ఎంతో బలపడ్డారు.  

బి. రాజు, స్కోప్‌ ఎన్జీవో

విరివిగా రుణాలు..

రైతులకు వ్యక్తిగతంగా రుణాలు ఇచ్చేందుకు అనేక బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. అలాంటి సమయంలో రైతులంతా సంఘటితంగా ఒక కంపెనీ ఏర్పాటు చేస్తే, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ముందుకొస్తాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీవోల ఏర్పాటు ద్వారా రైతులకు అన్ని బ్యాంకుల నుంచి విరివిగా రుణాలు లభించే అవకాశం ఉంటుంది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి....

భవిష్యత్‌ వ్యవసాయరంగంలో ఎఫ్‌పీవోల ప్రాధాన్యం భారీగా పెరగనున్నది. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎఫ్‌పీవోల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫ్‌పీవోలపై కీలక నిర్ణయం తీసుకున్నది. 2020-23 వరకూ దేశవ్యాప్తంగా మరో 10వేల ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని నాబార్డ్‌ ద్వారా అందించేలా చర్యలు తీసుకున్నది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. 

సంఘటితంగా వ్యవసాయం..

ఎఫ్‌పీవోల ద్వారా వ్యవసాయరంగం కూడా సంఘటితం అవుతుంది. ఈ కంపెనీల్లో సభ్యులైన రైతులు, పంటల సాగుపై విస్తృతంగా చర్చిస్తారు. ఏ పంటలు వేయాలి..? వేటికి ఎక్కువ డిమాండ్‌ ఉంది..? అనే అంశాలపై అవగాహన వస్తుంది. అదే విధంగా జనరల్‌బాడీ సమావేశాల్లోనూ అనేక అంశాలపై చర్చించి, పంటలు వేయడం.. వాటిని విక్రయించడంపై రోడ్‌ మ్యాప్‌ తయారు చేస్తారు. మార్కెట్‌లో ఏ పంటలకు డిమాండ్‌ ఉంటుందో, ఆ పంటలే పండించేలా చర్యలు తీసుకుంటారు. 

నేరుగా కొనుగోళ్లు..

ఎఫ్‌పీవో ఆధ్వర్యంలో రైతుల పంటలను నేరుగా కొనుగోలు చేస్తారు. మార్క్‌ఫెడ్‌ సాయంతో రైతుల నుంచి పంటలు కొనుగోలు చేసి, వాటిని మార్క్‌ఫెడ్‌కు అప్పగిస్తారు. తద్వారా ఎఫ్‌పీవోకు మార్క్‌ఫెడ్‌ నుంచి కమీషన్‌ కూడా వస్తుంది. అదే విధంగా పంటలకు మద్దతు ధర లేని పక్షంలో ఎఫ్‌పీవో కల్పించుకొని, నేరుగా కంపెనీలతో మాట్లాడి పంటలు కొనుగోలు చేయిస్తుంది. తద్వారా రైతులకు లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే కాకుండా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలను కూడా కంపెనీలు, ప్రభుత్వం నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంది. వాటిని మార్కెట్‌ ధర కన్నా తక్కువ రేటుకే రైతులకు విక్రయిస్తుంది. ఇలాంటి దుకాణాలు పెట్టేందుకు కూడా నాబార్డ్‌ కూడా రుణాలు ఇస్తుంది. 

నాబార్డ్‌ ఆర్థిక అండ..

ఎఫ్‌పీవోల ఏర్పాటుతోపాటు ఆర్థికంగానూ నాబార్డ్‌ అండగా ఉంటున్నది. ఇప్పటి వరకు వివిధ ఎఫ్‌పీవోలకు రూ.34.69 కోట్లు అందించింది. అనేక ఎఫ్‌పీవోలకు తొలి మూడేళ్లలో రూ.9 లక్షల చొప్పున ఆర్థిక సహకారాన్ని అందజేసింది. ఎఫ్‌పీవో ఏర్పాటు చేసిన తొలి మూడేళ్ల వరకూ సీఈవో వేతనాలను నాబార్డ్‌ నుంచే ఇవ్వడం విశేషం. దీంతోపాటు ఎఫ్‌పీవోలకు సబ్సిడీలో వ్యవసాయ పరికారాలను అందిస్తూ చేయూతనిస్తున్నది. నాబార్డ్‌కు చెందిన నాబ్‌ కిసాన్‌ ద్వారా ఎఫ్‌పీవోలకు పలు రకాల రుణాలను ఇప్పిస్తున్నది. ఎఫ్‌పీవోలో జమయ్యే, ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్క ఉంటుంది. ప్రతి ఎఫ్‌పీవోలోనూ యేటా ఆడిట్‌ నిర్వహిస్తారు. అందుకోసమే ప్రత్యేకంగా ఒక చార్టర్డ్‌ అకౌంటెంట్‌ను కూడా నియమించుకుంటారు. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా, ప్రతి లావాదేవీని బ్యాంకుల ద్వారానే జరుపుతారు. ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండుసార్లు జనరల్‌ బాడీ సమావేశం నిర్వహిస్తారు. పంటల కొనుగోళ్లు, అమ్మకాలు తదితర అంశాలపై చర్చించి అందరి ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమావేశంలో నిర్ణయించిన అంశాలను కచ్చితంగా అమలు చేస్తారు. 


logo