ఆదిలాబాద్, డిసెంబర్ 5(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది యాసంగి సాగు 1.65 లక్షల ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వానకాలంలో 5.20 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, సోయా సాగు చేస్తారు. సాగునీటి వనరులు సరిగ్గా లేకపోవడంతో యాసంగి సాగు తక్కువగా ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే వానకాలం పంటలు సోయా, పత్తి అమ్మకాలు కొనసాగుతున్నాయి. కంది పంట కాయ దశలో ఉంది. సోయా, పత్తి పంటలు తీసిన రైతులు యాసంగి వేస్తున్నారు. యేటా జిల్లావ్యాప్తంగా రైతులు యాసంగిలో శనగను అధికంగా సాగు చేస్తుండగా.. ఈ ఏడాది జొన్న విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జొన్న 70,520 ఎకరాలు, శనగ 68,500, మక్క 18,220, గోధుమ 4,650 ఎకరాల్లో వేయనున్నట్లు అధికారులు అంచనా వేశారు.
యాసంగి సీజన్‌కు 30 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఇందులో యూరియా ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 12 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్తోపాటు ఇతర ఎరువులు 10 వేల మెట్రిక్ టన్నులు వినియోగిస్తారని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడంతో ప్రాజెక్టులు, చెరువుల్లో పుష్కలంగా నీరు చేరింది. దీంతో సాగునీటి పథకాల కింద సాగు చేసే రైతులకు నీటి సమస్య లేకుండా పోయింది. బోర్లు, బావులపై ఆధారపడి రైతులు సాగు చేస్తారు. కరెంటు సమస్య లేకుంటే రైతులు తమ పంటలకు అవసరమైన సమయంలో నీటిని అందించి ఎక్కువ దిగుబడులు పొందే అవకాశాలున్నాయి.