ఆదిలాబాద్, జనవరి 2 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. గురువారం జిల్లాలో ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పల్ధరిలో 8.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం జిల్లాలో 15.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా గురువారం 7 డిగ్రీలు తగ్గి 8.4గా నమోదైంది. జిల్లాలో పది రోజులుగా చలి ప్రభావం కనిపించలేదు.
డిసెంబరు ప్రారంభం నుంచి చలి ప్రభావం ఎక్కువగా కనిపించింది. 17న జిల్లాలో అత్యల్పంగా 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తర్వాత మబ్బులతో కూడిన వాతావరణం కారణంగా చలి ప్రభావం తగ్గింది. పది రోజులుగా ఆదిలాబాద్ జిల్లాలో 13 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బేలలో 8.9 డిగ్రీలు, భీంపూర్ మండలం అర్లి (టీ), తాంసి, తలమడగు, జైనథ్, ఆదిలాబాద్ అర్బన్ మండలాల్లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలి కారణంగా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, చలి సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.