దండేపల్లి, ఆగస్టు 5 : లింగాపూర్ అటవీ బీట్లో గిరిజనులు గతంలో చెట్ల పొదలు తొలిగించి మక్క పంట వేయగా, మంగళవారం అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు వాటిని తొలగించారు. దీంతో అడవిబిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్ఐ తహసినొద్దీన్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. గిరిజనులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వారు వినిపించుకోలేదు.
జన్నారం డీఎఫ్వో రామ్మోహన్ అక్కడికి చేరుకొని పోడు భూముల్లో మొక్కలు నాటినా, వన్యప్రాణులకు హాని కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, పోడు భూముల్లో వేసిన పంటను నాశనం చేశారని, ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు.