“పద్నాలుగేండ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ పదేండ్లకాలంలో అద్భుతమైన, అమోఘమైన ప్రగతి సాధించాం. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో పల్లెలు, పట్టణాలు కనీవినీ ఎరుగనిరీతిలో ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. 60 ఏండ్లపాటు అస్తిత్వం కోసం ఉద్యమించిన మనం.. ప్రస్తుతం దేశంలోనే నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్తున్నాం.” అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంగ గోవర్ధన్ ఉద్ఘాటించారు. ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నిర్మల్ కలెక్టరేట్లో మంత్రి, ఆదిలాబాద్ కలెక్టరేట్లో విప్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానంగా సాగు నీరు, వ్యవసాయం, విద్య, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్ర సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు సంఘటితంగా పునరంకితం కావాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
– ఆదిలాబాద్/నిర్మల్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి, పదేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తున్నదన్నారు. 76 ఏండ్ల స్వాతంత్య్ర భారతావనిలో తెలంగాణ 60 ఏండ్ల పాటు అస్తిత్వం కోసం ఉద్యమించిందన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను కాపాడుకుందామని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని కా పాడడమే నిజమైన దేశభక్తి అని స్పష్టం చేశారు.
తెలంగా ణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడానికి ఆనాడు యావ త్ సమాజం ఉద్యమించిందని, ఆనాటి అపూర్వ ఘట్టా లు, జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచినట్లు గుర్తు చేశారు. అప్పటి ఉజ్వల ఘట్టాలను ఆనాటి యోధు ల వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం అందరి బా ధ్యత అన్నారు. రాష్ట్ర సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు సంఘటితంగా పునరంకితమవుదామని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ పాల్గొన్నారు