కౌటాల/సిర్పూర్(టీ), సెప్టెంబర్ 2 : మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వారా,్ద ప్రాణహిత నదులు ఉప్పొంగి తాటిపల్లి, విర్దండి గ్రామాల్లో పత్తి, మిరప పంటలు నీట మునిగిపోగా, సోమవారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సోమవారం విర్దండిలో పర్యటించారు. నీట మునిగిన పంటలను స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటల వివరాలు తెలుసుకున్నారు. నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
ఇక్కడ ఎక్కువగా కౌలు రైతులు ఉన్నారని, వారికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్ కలెక్టర్కు విన్నవించారు. రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దల దేవయ్య, తహసీల్దార్ పుష్పలత, ఎస్ఐ మధుకర్, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, ఏఈవోలు ఉన్నారు. అలాగే సిర్పూర్(టీ) మండలం పారిగాం గ్రామంలో వరదలో మునిగిన పత్తి పంటలను పరిశీలించారు. నాయకులు సత్యనారాయణ, సమీర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
యంత్రాంగం అప్రమత్తంగా ఉంది
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 2 : భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం మాలన్ గొంది గ్రామపంచాయతీలోని తూంపల్లి వాగుపై ఉన్న కల్వర్టు, రోడ్డు వరదకు కొట్టుకుపోగా సోమవారం తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండేతో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన గ్రామాలు అయిన మాలన్ గొంది (కొలాం గూడ), గోండు గూడ గ్రామాల మధ్య వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో మాలన్ గొంది, కుటోద (గోండు గూడ), కుటోద (కొలాం గూడ), మానాపూర్, శేఖన్ గొంది గ్రామాలకు-మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, వైద్య సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కృషి చేయాలని తెలిపారు. ఆయా గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని పంచాయతీ రాజ్ ఈఈని ఆదేశించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నం.6304686505ను సంప్రదించాలని తెలిపారు. ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.