ఎదులాపురం, సెప్టెంబర్ 24 : ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి ఆసరాగా నిలుస్తూ ప్రజల కష్ట సుఖాల్లో అండగా నిలుస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లోని ఓ ఫంక్షన్హాల్లో బంగారిగూడ పరిధిలో నివసిస్తున్న 1,485 ఇండ్లకు ఇంటి నంబర్లు పంపిణీ చేశారు. ముందుగా ఎమ్మెల్యేకు డప్పుచప్పుళ్ల మధ్య ఘన స్వాగతం పలికారు. తమ చిరకాల కోరిక నెరవేర్చిన ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బంగారిగూడలో నివాసముంటున్న ప్రజల ఏండ్ల నాటి ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రత్యేక దృష్టి సారించామని, అందుకు అనుగుణంగానే ఇంటి నంబర్ల కేటాయింపు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజాహితం కోసం అనునిత్యం పాటు పడుతున్నామని స్పష్టం చేశారు.
గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు చేసిందేమి లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం ప్రజా సంక్షేమానికి చేసింది శూన్యమని పేర్కొన్నారు. ప్రజల ఇక్కట్లను దూరం చేస్తుంటే, ఎన్నికల సమయంలో తాయిలాలు పంచి ఓట్లు రాబట్టాలని కొందరు ప్రతిపక్ష నేతలు ప్రయత్నించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఆందోళనల పేరిట ప్రతిపక్షాలు చేస్తున్న కుటీల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమినర్ శైలజ, రైతు బంధు సమితి అధ్యక్షుడు రోకండ్ల రమేశ్, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, అశ్రఫ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు సాజీదుద్దీన్, సలీమ్ పాల్గొన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని సాత్నాల బస్డాండ్ వద్ద గల చమన్ వాలే బాబా దర్గా షరీఫ్‌లో కమిటీ హాల్ భవన నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అంతకుముందు దర్గాలో మత పెద్దలతో కలిసి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. విద్యార్థుల కోసం మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసి విద్య అభ్యున్నతికి పాటుపడుతుందన్నారు. అలాగే మైనార్టీ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేలా రుణాలను సైతం అందిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో పుట్టగొడుగుల పుట్టుకొచ్చే నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణ అధ్యక్షుడు అజయ్, సభ్యులు అశ్రఫ్, యూనిస్ అక్బానీ, సాజీదుద్దీన్, చమన్వాలే బాబా కమిటీ అధ్యక్షుడు సయ్యద్ గయాసుద్దీన్, జావిద్, జాకీర్ పాల్గొన్నారు.
రక్తదానం చేయడానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. రిమ్స్ ఆడిటోరియంలో కిరాణా అండ్ జనరల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారిని అభినందించి పండ్ల రసం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంతో ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రక్తదానంపై అపోహలను విడనాడాలని సూచించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దాదాసాహెబ్, అధ్యక్షుడు గణేశ్, రవీందర్, హేమంత్ పాల్గొన్నారు.