దండేపల్లి, మార్చి 31 : మరో నెల రోజుల్లో పంట చేతికొస్తుందని ఆశపడ్డ జిల్లా రైతాంగానికి చివరకు నిరాశే మిగులుతున్నది. కడెం నీరందక.. భూగర్భ జలాలు అడుగంటి పొట్ట దశలో ఉన్న వరి కళ్లముందే ఎండుతుండగా దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. గతేడాది రంది లేకుండా రెండు పంటలు తీసిన అన్నదాతలు, ఈసారి తీవ్రంగా నష్టపోయే దుస్థితి దాపురించింది.
మంచిర్యాల జిల్లాలో యాసంగిలో 62,524 ఎకరాల్లో వరి సాగు చేశారు. 50 శాతం మేర సన్నాలు, మరో 50 శాతం మేర దొడ్డు రకం పంటలు వేశారు. గతేడాది అక్టోబర్ చివరి వరకు ఆశించిన మేర వర్షాలు కురవడంతో గ్రామాల్లోని చెరువులు,కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లోనూ చెరువులు, కుంటల్లో 70 శాతం మేర నీళ్లు ఉండడంతో పంటలు ఎండిపోకుండా చేతికొచ్చాయి.
ఈ క్రమంలో ఈ యేడాది వర్షాలు సరిగా కురవకపోవడం, కడెం ప్రాజెక్టు నుంచి క్రాప్ హాలిడే ప్రకటించడం.. మార్చి రెండో వారంలోనే ఎండలు ముదరడం.. భూగర్భజలాలు అడుగంటడం..వంటి కారణాల నేపథ్యంలో పంటలు చేతికందకుండా పోయే పరిస్థితి నెలకొంది. కొందరు రైతులు లక్షలు ఖర్చు చేసి బావుల్లో పూడికతీయిస్తుండగా, మరికొందరు బోర్లు వేయిస్తున్నారు. అయినా, భూగర్భజలాలు పెరగకపోవడం, గంటసేపు మోటరు నడవంగానే నీళ్లు అయిపోతుండడంతో రైతన్నలు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు తమ పొలాలను పశువుల మేతకు వదిలేయడం ఆందోళన కలిగిస్తున్నది.
గతేడాదితో పోలిస్తే ఈసారి ఎల్లంపెల్లి ప్రాజెక్టులో సుమారు 6 నుంచి 7 టీఎంసీలకు పైగా నీటి నిల్వలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు నుంచి తాగు, సాగునీటి కోసం విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో గూడెం ఎత్తిపోతల పథకంలో నీటి నిల్వలు తగ్గాయి. ఎల్లంపెల్లి బ్యాక్‌వాటర్‌తో మునిగి ఉన్న గూడెం వంతెన ఫిబ్రవరిలోనే బయటపడింది. పుష్కర ఘాట్లు కూడా తేలాయి. గోదావరిలో కూడా భారీగా నీటి మట్టం తగ్గడంతో రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది.
యాసంగిల రెండెకరాలోఓ్ల వరి వేసిన. కడెం నీళ్లు వస్తయన్న ఆశతోనే పంట వేసిన. నెల రోజుల్ల పంట చేతికొస్తదనుకుంటే గిట్లా ఎండిపోవట్టే. పంట అచ్చుడు పక్కన పెడితే పెట్టుబడి కూడా పోయేటట్టు ఉంది. సర్కారు ఏమాత్రం పట్టించుకోలే. వచ్చే యేడాది కూడా గిట్లనే చేస్తే మా బతుకులు ఆగమైతయ్.
-అత్తె పోషయ్య, రైతు, మాకులపేట
యేటా 5 ఎకరాల పొలం చేసేటోన్ని. ఈ సారి రెండెకరాలే వేసిన. అండ్ల ఎకరం ఎండి పోయింది. ఎకరం నువ్వులు వేసిన. గదానికి కూడా నీళ్లు సరిపోతలేవు. మక్క కూడా గట్ల నే ఉంది. మోటరు గంట కూడా నడుస్తలేదు. ఇది వరకు కడెం నీళ్లతోని గట్టెక్కినం. ఈసారి నిండా మునిగినం. ఎండిన వరిని పశువులు మేత కోసం వదిలేసిన. కాంగ్రెస్ సర్కారు రైతుల గురించి ఆలోచించాలే.
-బత్తుల శ్రీనివాస్, రైతు, మాకులపేట
గీ యాసంగిల రెండెకరాల్లో వరి వేసిన. పోయినేడాది మంచిగనే పంట చేతికొచ్చిందన్న భరోసాతో ఈసారి వేసిన. కడెం నుంచి నీళ్లు రాకపోవడంతో బావుల్లో నీళ్లు లేకుంటైనయి. నెల రోజుల్ల పంట చేతికొస్తుందని సంబుర పడుతుంటే మొత్తం ఎండిపోవట్టే. రూ. లక్ష పెట్టి బావిలో పూడిక కూడా తీయించిన. అయినా లాభం లేకుంటైంది. లక్ష నష్టంతో పాటు పెట్టుబడి కూడా పోయేటట్టే ఉంది. ఎకరం మొత్తం ఎండి పోయింది. ఇగ ఉన్న ఎకరం పొలం కూడా పండుతదన్న ఆశ లేదు.
-గోపతి సుధాకర్(రైతు)-మాకులపేట.
ఆరెకరాల్లో వరి వేసిన. పోయనసారి కడెం నీళ్లు రావడంతో దిగుబడి మంచిగనే వచ్చింది. గదే ఆశతో మళ్లా వరి వేసిన. ఇప్పటికే ఐదెకరాలు ఎండిపోయింది. ఎకరం మాత్రమే పొట్ట దశలో ఉంది. అది కూడా చేతికందుతుందన్న ఆశ లేదు. పంటలు కాపాడుకునేం దుకు రూ.2.50 లక్షలు పెట్టి బావిలో పూడిక తీయించిన. మోటరు గంట సేపు నడువకముందే నీళ్లు అయిపోతున్నయ్. పెట్టుబడి రూ.లక్ష దాకా పోయినట్లే. కాంగ్రెస్ సర్కారు ముందు చూపు లేక ఈ పరిస్థితి దాపురించింది. నష్టపోయిన రైతులను ఆదుకోవాలె. కేసీఆర్ సర్కారు ఉన్నన్ని రోజులు రంది లేకుంట బతికినం.
-పర్శనేని రాజగోపాల్, రైతు, మాకులపేట