కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పంటలకు అందించాల్సిన సాగునీరు వృథాగా గోదావరి పాలవుతుండగా మరో వైపు ఆయకట్టు పంటలకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకో వైపు ప్రాజెక్టు కాలువల్లో పిచ్చి మొక్కలు, పూడికతో నిండిపోయి నిరుపయోగంగా మారుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అతిపెద్దదైనా కుమ్రం భీం ప్రాజెక్టును 45,500 ఎకరాలకు సాగునీరందించేందుకు నిర్మించారు.
వట్టివాగు ప్రాజెక్టు, చెలిమెల(ఎన్టీఆర్) ప్రాజెక్టులున్నప్పటికీ వాటి నుంచి ఇంతవరకూ పంటలకు సాగునీరందించలేదు. కానీ కుమ్రం భీం ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎంతో కొంత మేలు జరిగింది. ప్రాజెక్టు కట్ట పగుళ్లు తేలుతుండడంతో 10 టీఎంసీల సామర్థ్యం గల కుమ్రం భీం ప్రాజెక్టు గతేడాది నుంచి 5 టీఎంసీలకు పరిమితమైంది. పగ్గుళ్లు తేలిన చోట్ల ప్లాస్టిక్ కవర్లను కప్పి అధికారులు తాత్కాలికంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రాజెక్టు మరమ్మతుల విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
5 టీఎంసీలకే పరిమితమైన ప్రాజెక్టు ..
కుమ్రం భీం ప్రాజెక్టు కట్ట బలహీన పడి పగుళ్లు తేలడంతో వరద తాకిడిని కట్టకు తగలకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు గమనిస్తూ 5 టీఎంసీలకే పరిమితం చేస్తూ మిగతా నీటిని గేట్లు తెరిచి వృథాగా వదిలేస్తున్నారు. కానీ కాలువల ద్వారా పంటలకు మాత్రం సాగునీటిని వదలడం లేదని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాలువలకు నీటిని వదిలితే ఆయకట్టు కింద ఉన్న కొన్ని ఎకరాలకైనా సాగునీరు అందేదని, ప్రస్తుతం నాట్లు వేసుకునే వారమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు కాలువలన్నీ నిరుపయోగంగా మారి పిచ్చిమొక్కలు, గడ్డి, పూడికతో నిండిపోయాయి.
సాగునీరందక రైతుల తిప్పలు..
జిల్లాలో బావులు, బోరు బావుల నీటితో కొందరు రైతులు వరి సాగు చేస్తున్నారు. తలాపునే ప్రాజెక్టు ఉన్నప్పటికీ పంటలకు చుక్క నీరు అందడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరు బావుల కింద వరి సాగు చేస్తున్నప్పటికీ విద్యుత్ కోతల కారణంగా సాగునీరు అందుతుందో లేదోనని కొంత మంది రైతులు వరి సాగుకు దూరంగా ఉంటున్నారు. గతంలో కుమ్రం భీం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేయడంతో కాలువల్లో రైతులు ఆయిల్ ఇంజిన్లు పెట్టి పంటలకు నీరు అందించారు. ఈ సారి నీటి విడుదల లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ప్రాజెక్టు కట్టకు మరమ్మతులు చేయాలని, నీటిని వృథాగా వదలకుండా పంట కాలువల ద్వారా అందించాలని రైతులు కోరుతున్నారు.