ఆదిలాబాద్, ఆగస్టు 13(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా జ్వరాలు పంజా విసురుతున్నాయి. సీజనల్ వ్యాధుల ప్రభావంతో జనం అల్లాడుతున్నారు. వైరల్ ఫీవర్స్‌తోపాటు డెంగ్యూ, టైఫాయిడ్‌తో ప్రజలు సతమతం అవుతున్నారు. జ్వరాలబారిన పడి వైద్యం కోసం వచ్చే వారితో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం, దోమలు, కలుషితమైన నీరు జ్వరాలు ప్రబలడానికి కారణమవుతున్నాయి. ఏజెన్సీ గ్రామాల్లో వ్యాధులు ప్రభావం ఎక్కువగా ఉంది. జ్వరాలతో గిరిజన గ్రామాల ప్రజలు చికిత్సల కోసం ఉట్నూర్, ఆదిలాబాద్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం ప్రభుత్వ దవాఖానలను విజిట్ చేసింది.
ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు వచ్చే వారి సంఖ్య పది రోజులుగా పెరిగింది. సోమవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో 2,361 ఓపీ, 775 ఐపీ నమోదు అయినట్లు డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులకు చికిత్సలు అందించడానికి 60 బెడ్స్‌తో కూడిన మూడు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్స్‌లో వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య బాగా పెరిగింది. రోగులతో ప్రైవేటు ఆసుపత్రులు కిటికిటలాడుతున్నాయి. వివిధ గ్రామాల ప్రజలు జ్వరాలతో ఆసుపత్రుల్లో చేరుతుండడంతో వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది.
వివిధ వ్యాధులతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య కొన్ని రోజులుగా బాగా పెరిగింది. వైరల్ ఫీవర్స్‌తోపాటు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం వచ్చే రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాం. మూడు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి బెడ్ల సంఖ్యను పెంచాం. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో టీఎంలు ఏర్పాటు చేసి 24 గంటలు చికిత్సలు అందిస్తున్నాం. వివిధ రకాల పరీక్షలు నిర్వహించడంతోపాటు మందుల కొరత లేకుండా చూస్తున్నాం.
– జైసింగ్ రాథోడ్, డైరెక్టర్, రిమ్స్