కాగజ్నగర్, జూన్ 27 : తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేకుండా పోయాడని, వెంటనే సమస్య పరిష్కరించాలని భట్టుపల్లి గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ తాగు నీరు సరిగా సరఫరా కావడం లేదని, ఒకవేళ సరఫరా చేసినా కలుషిత నీరే వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాకాలంలో కలుషిత నీరు సరఫరా చేయడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశమున్నదని, ఇకనైనా శుద్ధజలం అందించాలని కోరారు. కరెంట్ కూడా సరిగా సరఫరా చేయకపోవడం వల్ల అవస్థలు పడుతున్నామని, పారుశుధ్య పనులు కూడా చేపట్టడం లేదని వారు మండిపడ్డారు. అధికారులు అక్కడికి చేరుకొని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.