చింతలమానేపల్లి, జూలై 19 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ సరిపడా యూరియా అందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామంలో డీసీఎంఎస్ సెంటర్ ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేస్తున్న స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో యూరియా అందించడంలో విఫలమైందని, నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కేంద్రం నుంచి యూరియా తీసుకురాలేకపోతున్నారన్నారు.
యూరియా కొరత వల్ల రైతులు తీవ్రంగా కష్టాలు ఎదుర్కొంటున్నారని, దళారులు అధిక రేటుకు యూరియా అమ్మి వారిని మోసగిస్తున్నారని తెలిపారు. గిరిజన, గిరిజనేతర పోడు రైతులకూ యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్య ఇలాగే కొనసాగితే రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
యూరియా కొరత గురించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో మాట్లాడారు. అనంతరం చింతలమానేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల కేతిని వాగులో పడి మృతిచెందిన సెడ్మెకే సుమన్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఆయన వెంట నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యామ్‌రావు, మండల కన్వీనర్ గోమాసె లాంచు, నక్క మనోహర్, మున్నాఖాన్, షాకీర్, ఆదె శ్రీనివాస్, ప్రవీణ్, శంకర్, తదితరులు ఉన్నారు.