ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురియడంతో అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చింది. బలమైన ఈదురుగాలులకు తోడు వడగండ్ల వాన కురియడంతో పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికొచ్చే దశలో నేలవాలడంతో అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లినైట్టయింది. చాలా ప్రాంతాల్లో మొక్కజొన్న నేలవాలగా.. మామిడి పిందెలు నేలరాలాయి. చేతికొచ్చే దశలో మొక్కజొన్న దెబ్బతిన్నది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా సగటున 11.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దిలావర్పూర్ మండలంలో 20.6, దస్తురాబాద్‌లో 17.5, లక్ష్మణచాందలో 17.3, కడెం పెద్దూర్లో 14.9, పెంబిలో 14.0, సారంగాపూర్, ఖానాపూర్‌లలో 13.9, నిర్మల్‌లో 13.3 మిల్లీమీటర్ల వర్షం పడింది. అలాగే ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సగటున 4.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. గుడిహత్నూర్ మండలంలో 10.4, నార్నూర్, మావల 5.8, ఇంద్రవెల్లి 5.5, ఉట్నూర్ 5.4, ఆదిలాబాద్ అర్బన్ 5.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
– మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, మార్చి 31(నమస్తే తెలంగాణ)
నిర్మల్ జిల్లావ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి మొదలైన ఈదురుగాలుల బీభత్సం తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈదురుగాలులతోపాటు వడగండ్ల వాన కురియడంతో కోతదశకు వచ్చిన వరి పైరు నేలవాలింది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా నాట్లు పూర్తి చేసిన లోకేశ్వరం, కుంటాల, సారంగాపూర్, నిర్మల్, సోన్ మండలాల్లో వరి కోత దశకు రాగా, ఆయా మండలాల్లోని రైతులకు నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న మక్క, పూత దశలో ఉన్న నువ్వు పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. నువ్వు పంట పూర్తిగా నేలకొరుగగా, సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. కాగా.. సోయా చేతికొచ్చిన తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాల్లో సాగు చేసిన మక్క పంటకు ఇప్పటికే గింజ గట్టి పడినందున ఈ వర్షంతో పెద్దగా నష్టం ఉండదని అధికారులు చెబుతున్నారు.
పత్తి తర్వాత డిసెంబర్లో వేసిన మక్కకు కొంత వరకు నష్టం జరిగే అవకాశం ఉందటున్నారు. ఇప్పటికే చేతికొచ్చిన పసుపు పంటను ఉడకబెట్టి కల్లాల్లో ఆరబోశారు. రాత్రి కురిసిన వర్షంతో ఎండిన పసుపు పంట పూర్తిగా తడిసింది. దీంతో పసుపు రంగు మారి ఆశించిన ధర వచ్చే అవకాశం లేదు. 5,527 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. 3,368 ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, ఈసారి మంచి పూత, కాత ఉండడంతో నిన్న మొన్నటి వరకు మామిడి రైతులు సంతోషించారు.
ఈదురుగాలులతో తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని ముథోల్, కుంటాల, కుభీర్, తానూర్, పెంబి, దస్తూరాబాద్, దిలావర్పూర్, సారంగాపూర్, లక్ష్మణచాంద, మామడ, సోన్, నిర్మల్ మండలాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పంటలు నష్టపోయిన రైతులకు నయాపైసా పరిహారాన్ని ఇవ్వలేదని రైతులు మండిపడుతున్నారు. ఈసారైనా సకాలంలో నష్టం అంచనాలు రూపొందించి పరిహారాన్ని అందజేయాలని రైతులు కోరుతున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో వానకాలంలో పత్తి, సోయా పంటలను రైతులు నష్టపోయారు. దిగుబడులు సరిగా రాక పెట్టుబడులు కూడా రాలేదు. యాసంగిలో నష్టాన్ని కొంత మేరకు తగ్గిస్తామనుకున్న రైతులను అకాల వర్షం నట్టేట ముంచింది. వారం రోజుల కిందట కురిసిన వర్షం, గాలితో రైతులు జొన్న, మొక్క జొన్న పంటలను నష్టపోయారు. సోమవారం రాత్రి కురిసిన వర్షంతో కూడా రైతులు మరోసారి నష్టపోయారు. జొన్న, మొక్కజొన్న పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.

ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు పంటలు నష్టపోతున్నారు. వానకాలంలో అధిక వర్షాలకు 20 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. భారీ గాలులు, వర్షంతో యాసంగిలో వందల ఎకరాల్లో చేతికొచ్చిన పంటలను రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. లక్షల రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో నష్టపోతుండడంతో రైతులు అప్పులపాలవుతున్నారు. వానకాలంలో పత్తి, సోయా నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదు. ఫసల్ బీమా పథకం అమలుకాక పోవడంతో బీమా వర్తించడం లేదు. ఫసల్ బీమా పథకం అమలు చేయాలని రైతు సంఘాల నాయకులు ప్రభుత్వానికి పలుమార్లు సూచించినా ఫలితం లేకుండా పోతుంది. ప్రభుత్వం జిల్లాలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం తమకు తీవ్ర నష్టం కలిగించింది. కష్టపడి ఎకరం భూమిలో పసుపు సాగు చేయగా, 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. వచ్చిన పంటను ఉడకబెట్టి వారం రోజులుగా నిరంతరం కాపలా ఉంటూ ఆరబెట్టిన. మరో రెండు, మూడు రోజుల్లో అమ్మేందుకు మార్కెట్‌కు తీసుకెళ్దామనుకుంటున్న తరుణంలో అకాల వర్షంలో పసుపు పూర్తిగా తడిసింది. తడిసిన పసుపును మళ్లీ ఎండబెట్టినా ఎర్రబారిపోతుంది. ప్రస్తుతం పసుపుకు మార్కెట్లో క్వింటాలుకు రూ.12 వేల నుంచి రూ.13 వేల ధర ఉంది. రంగుమారిన పసుపును రూ.8 వేల నుంచి రూ.9 వేలకు మాత్రమే కొంటరు. అంటే అకాల వర్షం కారణంగా క్వింటాలుకు రూ.4వేల నుంచి రూ.5 వేల వరకు నష్టపోవాల్సి వస్తున్నది. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పసుపు రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి.
– రాజారెడ్డి, పసుపు రైతు, సాంగ్వి, దిలావర్పూర్ మండలం, నిర్మల్ జిల్లా
ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా రైతులు యాసంగిలో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న పంటలను నష్టపోవాల్సి వస్తున్నది. కంకి దశలో ఉన్న రెండు పంటలు నేలవాలాయి. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలి. ఇటీవల కురిసిన వర్షంతో పంటలు నష్టపోయినా వ్యవసాయాధికారులు వివరాలు సేకరించడం లేదు. రైతులు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చినా స్పందించడం లేదు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
– సంగెం బొర్రన్న, రైతు స్వరాజ్య వేదిక, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు