సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తాము బతికుండాగానే రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు మరణించారని తెలిపారు. బస్‌భవన్ వద్దకు మంగళవారం తెలంగాణ రిటైర్ట్ ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో తరలివచ్చారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి బస్ భవన్ వరకు ర్యాలీ తీశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు 15వేల మంది రావడంతో బస్ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. వీరిని నిలువరించడానికి పోలీసులు భారీగా మోహరించారు. రోడ్డుపైకి రాకుండా బారికేడ్లు అడ్డుగా వేశారు. జిల్లా డిపోల వారీగా తరలొచ్చిన కార్మికులు రేవంత్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజయ్య మాట్లాడుతూ.. రిటైర్డ్ ఉద్యోగులకు 2017, 2021 పీఆర్సీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ పెన్షన్ పెరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు వైద్య సదుపాయాలు, మందుల పంపిణీ సరిగా జరగడం లేదని ఆరోపించారు. గతంలో తార్నాక ఆసుపత్రిలో విశ్రాంత ఉద్యోగులకు ప్రతి నెలా ఇవ్వవలిసిన మెడిసిన్‌ను ఒకేసారి రెండు నెలలకు సరిపడా ఇచ్చేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కేవలం ఒక నెలకు మాత్రమే ఇవ్వడం వల్ల వివిధ జిల్లాల నుంచి వచ్చే వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అన్ని జిల్లా ఆసుప్రతుల్లో సరిపడా ఆరోగ్య సేవలు, మందులు అందుబాటులో ఉంచాలని కోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న ఉద్యోగులు మరణించినప్పుడు వారి దహన సంస్కారాలకు రూ. 30 వేలు సంబంధిత కుటుంబాలకు అందించాలని డిమాండ్ చేశారు. సూపర్ లగ్జరీల్లో విశ్రాంత ఉద్యోగులకు, వారి జీవిత భాగస్వాములకు ఉచిత ప్రయాణం అనుమతించాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాము మాట్లాడుతూ.. కరప్షన్ లేని ఆర్టీసీలో పనిచేసినందుకు చాలా గర్వంగా ఉందన్నారు. వేల కోట్ల అవినీతితో ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడుతున్నారన్నారు. ఆర్టీసీలో ఎన్నో ఏండ్ల నుంచి నిబద్ధతతో పనిచేశామని తెలిపారు. సుమారు 6 లక్షల వరకు ఏరియర్స్ వస్తుందని తెలిపారు. 41,495 మందికి బెన్ఫిట్స్ అందలేదని వాపోయారు.
రేవంత్ రెడ్డి తమ సమస్యలపై ఎందుకు స్పందించడం లేదో తెలియడం లేదని చెప్పారు. శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఫుట్‌బాల్ ఆడటం కోసం సీఎం రేవంత్ రెడ్డి వంద కోట్లు ఖర్చు చేశారని దాని వల్ల ఒనగూరిందేమిటో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నో ఏండ్లుగా తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి ప్రయాణికులకు సేవలందించిన తమకు మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని వాపోయారు. ఇప్పుడు తమ నిరసన శాంతియుతంగా ఉందని, సమస్యలు పరిష్కరించకపోతే గుడ్లు పీకి గోలీలాడుతామని, లాగులో తొండలు ఇడుస్తామని, పేగులు మెడలో వేసుకుంటామని హెచ్చరించారు. రేవంత్ నేర్పిన తిట్లనే తాము చేసి చూపెడుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.
2023లో రిటైర్మెంట్ అయ్యాను. ఇప్పటి వరకు బెన్ఫిట్స్ అందలేదు. 2017 నుంచి ఏరియర్స్ పెండింగ్‌లో ఉంది. ఎలాంటి ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కుటుంబం రోడ్డున పడాల్సిన దుస్థితి వస్తుంది. ప్రభుత్వం బెన్ఫిట్స్ ఇస్తే ఇల్లు కట్టుకుందామని కలలు కన్నాం. కానీ బతికుండగా అది నెరవేరేలా లేదు. మాలాంటి ఉద్యోగుల బతుకులు ఘోరంగా ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు బస్‌భవన్ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నాం. సర్కార్‌కు చీమ కుట్టినట్టుగా కూడా లేదు.
– నర్సింహ గౌడ్, రిటైర్డ్ ఉద్యోగి
ప్రభుత్వంపై మాకు చాలా నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. అనేక అనారోగ్య సమస్యలతో రిటైర్డ్ ఉద్యోగులు బాధపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ్నుంచో హైదరాబాద్‌కు చేరుకొని మా కష్టాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరికి షుగర్,బీపీలతో బాధపడుతున్నారు. బతికుండగానే తమ కుటుంబానికి తమ కష్టఫలం అందించాలని ఆశపడుతున్నాం. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.
– అభిమన్యు, రిటైర్డ్ ఉద్యోగి
మేం చస్తున్నాం మా కష్టాన్ని దోచుకోవద్దు అని వేడుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు. కనీసం మానవీయత ప్రదర్శించడం లేదు. వయోభారంతో బాధపడుతున్న తమకు ఇంత దూరం ప్రయాణించాల్సిన అవసరం ఎందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి మా సమస్యను పరిష్కరించకుండా మౌనంగా ఉంటున్నారు. ఆర్టీసీ ఎండీకి అనేక సార్లు వినతిపత్రాలు అందించాం. ఏమాత్రం ఫలితం లేదు. ఇది సరైనది కాదు. ఇప్పటికే మాలో చాలా మంది చనిపోయారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జర మా బకాయిలు చెల్లించి మమ్మల్ని ఆదుకోండి.
– నరసయ్య, రిటైర్డ్ ఉద్యోగి