కుమ్రం ఆసిఫాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : అకాల వర్షాలు జిల్లా రైతులను నిలువునా ముంచాయి. పంట చేతికొచ్చే దశలో పూర్తిగా దెబ్బతినగా, కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. కొందరు తీవ్ర వేదనతో పత్తి చెట్లు పీకేసి నిప్పు పెడుతుండగా, మరికొందరు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళనకు గురి చేస్తున్నది. నష్టపోయిన అన్నదాతలకు పరిహారమిస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించి మూడు నెలలు దాటినా, రూపాయి మంజూరు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో ఈ ఏడాది 3.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలతో ఒక్కో ఎరకానికి రూ. 30 వేల నుంచి రూ. 35 వేల వరకు ఖర్చుచేశారు. కనీసం ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తే లాభాల మాటెలా ఉన్నా, కనీసం పెట్టిన పెట్టుడులు చేతికి వచ్చి నష్టం రాకుండా ఉండే అవకాశముంటుంది. కానీ, పత్తి పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. గతంలో ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ ఏడాది కనీసం 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇక ఉన్న పత్తినైనా ఏరుదాం అనుకుంటే.. ఒక్కో కూలీ కిలోకు రూ. 10 నుంచి రూ. 12 దాకా తీసుకుంటున్నారు. వచ్చే ఆదాయం కంటే కూలీల ఖర్చే అధికమవుతోంది. దీంతో పత్తి ఏరుకునే బదులు వదిలేయడమే మంచిదని చెట్లను పీకేసీ తగులబెడుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం ముత్తంపేట గ్రామానికి చెందిన గుర్లె మల్లేశ్ రెండెకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. కౌలుకు రూ. 24 వేలు. పంట పెట్టుబడికి రూ. 50 వేల ఖర్చు అయింది. ఇటీవల మొంథా తుపాన్‌తో పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది. 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ. 6 వేల చొప్పున 6 క్వింటాళ్ల పత్తి అమ్మితే రూ. 36 వేలు వచ్చాయి. ఈ లెక్కన రైతు కష్టం పోను తిరిగి రూ. 38 వేల అప్పు మిగిలింది. చేనులో మిగిలిపోయిన పత్తిని తీసేందుకు కిలోకు రూ. 12 ఖర్చు అవుతుండడంతో మరింత నష్టం వస్తుందని భావించాడు. తీవ్ర ఆవేదనతో శుక్రవారం పత్తి చెట్లను తీసి కుప్ప పెట్టి నిప్పు పెట్టాడు.
పంట దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక జిల్లాలో ఇప్పటికే ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాంకిడి మండలం మండోకర్ వాడకు చెందిన బెట్లె సుధాకర్ (34) ఈ నెల ఒకటిన పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రైతు 9 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. భారీ వర్షాలతో పంట దెబ్బతినగా, దిగుబడి వచ్చే అవకాశం లేక మనస్తాపం చెంది ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఇక సిర్పూర్-టీ మండం చింతకుంట గ్రామానికి చెందిన పట్టల కిష్టయ్య (62) గత నెల 31న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన తనకున్న 4 ఎకరాల్లో పత్తి సాగుచేశాడు. అధిక వర్షాలతో దిగుబడి వచ్చే అవకాశం లేకపోవడంతో తీవ్ర వేదనకు గురై పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మరణించాడు.