భైంసా, ఫిబ్రవరి 5 : నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీకి నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కేసీఆర్ పాలనలో దూసుకెళ్లిన బల్దియా.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చతికిలా పడింది. కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీలో సుమారు రూ.20 కోట్లతో రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, డివైడర్లు ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు చేయించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. భైంసా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి మినహా కాంగ్రెస్ పాలనలో ఏమి కాలేదు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాలు, ఓపెన్ జిమ్‌లు మెయింటనెన్స్ లేక పనికి రాకుండా పోతున్నాయి. దీనికితోడు పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.

కేసీఆర్ హయాంలో భైంసా మున్సిపాలిటీలో సుమారు రూ. 20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, అందులో బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టారు. అంతేగాకుండా సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీల నిర్మాణాలు, వైకుంఠధామం నిర్మించారు. క్రీడా ప్రాంగణాలు, పార్కులు, నర్సరీలు, ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో కొన్ని నిర్వహణ లేక కొట్టుమిట్టాడుతున్నాయి.
క్రీడాకారుల కోసం భైంసా పట్టణంలో రూ.5.20 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియం నిరుపయోగంగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు తీరుతో క్రీడా మైదానం ధాన్యం ఆరబోసేందుకు ఉపయోపడుతున్నది. బీఆర్ఎస్ పాలనలో పండుగ వాతావరణం ఉండేది.
కేసీఆర్ సర్కారు రైతులు, కూరగాయాల వ్యాపారుల సౌకర్యార్థం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రూ.7.20 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వేజ్ మార్కెట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంతలోనే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం మౌలిక వసతులు కల్పించకపోవడంతో రోడ్డుపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

కేసీఆర్ హయాంలో భైంసా పట్టణంలో 640 డబుల్ బెడ్రూంల ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయి. సొంతిల్లు కట్టుకునే స్థోమత లేని వారికి 440 ఇండ్లకు లక్కీ డ్రా తీశారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటిని ఇప్పటివరకు అందించలేదు.