చెన్నూర్ రూరల్, నవంబర్ 1 : దీపావళి సెలవులకు ఇంటికొచ్చిన ఇద్దరు విద్యార్థులు గోదావరిలో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం దుగ్నెపల్లిలో శుక్రవారం జరగగా, ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. దుగ్నెపల్లికి చెందిన కొండ పోచయ్య-శోభ చెన్నూర్‌లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు అరుణ్(19) కిష్టంపేట డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అలాగే అదే గ్రామానికి చెంది న దాసరి కృష్ణ-మధులత దంపతులు రామగుండంలో ఉం టున్నారు. వీరి కుమారుడు సాయి (16) కరీంనగర్‌లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చ దువుతున్నాడు.
దీపావళి సెలవులు రావడంతో స్వగ్రామానికి తిరిగివచ్చారు. ఈ క్రమంలో అరు ణ్, సాయి శుక్రవారం ఉదయం తమ స్నేహితులతో కలిసి అన్నారం బ్యారేజ్ సమీపంలోని గోదావరికి ఈతకు వెళ్లారు. బ్యారేజ్ గేట్లు తీసి ఉండడంతో వరద ఉధృతికి అరుణ్, సాయి గల్లంతయ్యారు. మిగతా నలుగురు స్నేహితులు క్షేమంగా ఒడ్డుకు చేరారు. 10 మంది గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి అరుణ్, సాయి మృతదేహాలను వెతికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పండుగ పూట ఇద్దరు మృత్యువాత పడగా, వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తునట్లు సీఐ రవీందర్ తెలిపారు.