కోటపల్లి, జూలై 18 : కోటపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు మరోసారి రోడ్డెక్కారు. హెచ్ఎం అశోక్ తమపై అసభ్యంగా ప్రవరిస్తున్నాడంటూ ఈ నెల 9న విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయగా, డీటీడీవో, ఏటీడీవోలు విచారణ చేపట్టి ఉన్నతాధిదికారులకు నివేదిక పంపారు. ఇప్పటి వరకు హెచ్ఎంపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం బదిలీ చేయడంపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణ అధికారిని నియమించినా ఆమె పాఠశాలకు రాకపోవడంపై శుక్రవారం కోటపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ గోడును వెల్లబోసుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి హెచ్ఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏటీడీవో పురుషోత్తం, కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్రరావ్, ఎస్ఐ రాజేందర్ అక్కడికి చేరుకొని వారిని సముదాయించేందుకు యత్నించినా వారు వినలేదు.
ఉన్నతాధికారులు హెచ్ఎంను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనను సస్పెండ్ చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. విచారణ త్వరగా పూర్తి చేసి న్యాయం చేస్తామని అధికారులు చెప్పడంతో వారు శాంతించారు. కాగా, కలెక్టర్ కుమార్‌దీపక్ ఆదేశాలతో ఆశ్రమ పాఠశాలలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి రాజేశ్వరి శుక్రవారం సాయంత్రం విచారణ చేపట్టారు.