Adilabad | కాసిపేట, అక్టోబర్ 27: ఆదివాసీ గిరిజన దేవతలకు, దేవాలయాలను, దేవస్థానాలకు రక్షణ కల్పించి అభివృద్ధి చేయాలని ఆదివాసీలు కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సునీల్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవో శేఖ్ సఫ్టర్ అలీకి, తదితర అధికారులకు ఆదివాసీ గిరిజనులు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గిరిజన సంస్కృతి దేవతలు, దేవాలయాలు, దేవ స్థానాలు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక పథకం ద్వారా రక్షణ కల్పిస్తూ అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. గిరిజన దేవాలయాలు, దేవ స్థానాలు అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. మద్య ప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక పథకం ద్వారా అభివృద్ధి చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చేయాలని కోరారు.
ఆదివాసీ గిరిజన కుటుంబ దేవతలు, గ్రామ దేవతలు, వంశ కుల దేవతలు, గిరిజన సంస్కృతి మా దేవతలకు రక్షణ కల్పించి అభివృద్ది చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోయ పున్నెం రాయ్ సభ అధ్యక్షులు పెంద్రం హన్మంతు, ప్రధాన కార్యదర్శి ఆడే జంగు, మండల సర్మేడి సిడం జంగు, మండల గీతదార్ సిడం గణపతి, పెంద్రం ప్రభాకర్, అర్క జైతు, కోవ గణపతి, ఆడె జంగు, సిడం రమేష్, కుర్సింగ సూరు, కోవ వినయ్ తదితరులు పాల్గొన్నారు.