మంచిర్యాల, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓ పార్టీకి అంటకాగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దండేపల్లి మండలం పాత మామిడిపల్లి నుంచి సర్పంచ్‌గా నామినేషన్ వేసిన గుర్రాల మాధవిని బలవంతంగా విత్‌డ్రా చేయించేందుకు యత్నించడం, దానికి పోలీసులు సహా ఎన్నికల అధికారులు సహకరించినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మొదటి విడుత ఎన్నికలు జరగాల్సిన ఈ గ్రామ పంచాయతీలో అధికార పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు ఆ పార్టీ నాయకులు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే నామినేషన్ ఉపసంహరణకు మధ్యాహ్నం 3 గంటలకే గడువు ముగిసినప్పటికీ, గుర్రాల మాధవి అనే సర్పంచ్ అభ్యర్థిని బలవంతం చేసి సాయంత్రం 4 గంటల తర్వాత విత్‌డ్రా కోసం నామినేషన్ కేంద్రానికి పంపించారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా సాయంత్రం 4.20 సమయంలో అధికారులు ఆమెను వెనుక డోర్ నుంచి నామినేషన్ హాల్లోకి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు మొత్తం బయటికి వచ్చిన నేపథ్యంలో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహాలో హాజీపూర్ మండలంలోని ఓ గ్రామంలో వార్డు మెంబర్లుగా నామినేషన్ వేయడానికి వచ్చిన వారిని సైతం కొందరు నాయకులు బెదిరించినట్లు తెలిసింది.
రేషన్ కార్డులు రద్దు చేయిస్తామని, ఇండ్లు రాకుండా చేస్తామని హెచ్చరించడంతో ఆ గ్రామంలో వార్డు మెంబర్లుగా ఆ పార్టీ నాయకులు తప్ప మరెవ్వరూ నామినేషన్లు వేయలేదని, ఇక్కడ సర్పంచ్‌గా పోటీలో ఉన్న తనను సైతం నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని ఆ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఓ నాయకుడు చెప్పారు. తన పేరు బయటికి వస్తే ఇబ్బందులు పెడుతారని.. దయచేసి తన పేరు బయటికి రాకుండా చూసుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితి ఈ రెండు గ్రామాల్లోనే ఉందా.. వేరే గ్రామాల్లోనూ ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులే ఇలా ఓ పార్టీకి అంట కాగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాతమామిడిపల్లి ఘటనను సీరియస్‌గా తీసుకోని తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
నిర్మల్ జిల్లాలోనూ బలవంతపు ఏకగ్రీవానికి ఒత్తిడి తేవడం.. ఓ సర్పంచ్ అభ్యర్థి భర్త ఉరి వేసుకునేందుకు దారి తీసినట్లు తెలిసింది. ఖానాపూర్ మండలం ఏర్వచింతల్(సోమారిపేట్) గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బండారి పుష్ప, రవీందర్ దంపతులు నవంబర్ 29న దీక్షాదివస్ నాడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో రవీందర్ భార్య పుష్ప గ్రామ సర్పంచ్‌గా నామినేషన్ వేశారు. గెలిచే అభ్యర్థి కావడంతో నిన్న(బుధవారం)నామినేషన్ల విత్‌డ్రా సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీందర్‌పై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. మీకే అవకాశం ఇస్తాం.. కానీ నువ్వు బీఆర్ఎస్ వదిలేసి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాలి.
అలా చేస్తే మా పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థి విత్‌డ్రా చేసుకొని మిమ్ములను ఏకగ్రీవం చేస్తామంటూ.. ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేసినట్లు రవీందర్ భార్య పుష్ప తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి దాకా ఫోన్లో మాట్లాడాడని, ఆన్లైన్లోనే ఉన్నాడని, ఉదయం 5 గంటల సమయంలో పశువుల కొట్టంలోని దూలానికి ఉరి వేసుకొని నిర్జీవంగా కనిపించారని ఆమె వాపోయారు. నా భర్త ఆత్మహత్యకు రాజకీయ బెదిరింపులే కారణమై ఉండొచ్చనే అనుమానం ఉందంటూ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, రవీందర్ ఆత్మహత్యకు గల కారణం ఏమిటి అన్న విషయాన్ని పోలీసులు నిగ్గుతేల్చాల్సి ఉంది.
ఇలా ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లకు సాధారణ గ్రామీణ స్థాయి నాయకులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తాజాగా.. వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పారదర్శకత, రాజకీయ స్వేచ్ఛ ఏమైపోయిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు భయాందోళన చెందకుండా భరోసా కల్పంచాలనే డిమాండ్ క్షేత్రస్థాయి నుంచి వినిపిస్తున్నది.