తెలంగాణ మణి కిరీటం, నల్ల బంగారు మాగాణి సింగరేణి సంస్థ ఆవిర్భవించి 135 వసంతాలు పూర్తి చేసుకొని 136వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. సంస్థ పరిధిలో మరో 100 సంవత్సరాలకు పైగా బొగ్గు ఉత్పత్తికి అవకాశాలున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో ఉత్పత్తి విషయంలో 200 శాతం అభివృద్ధి సాధించింది. 20 వేల మంది యువతకు కేసీఆర్ సర్కారు ఉద్యోగాలు ఇచ్చి ఉపాధి కల్పించారు. నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం.
శ్రీరాంపూర్, డిసెంబర్ 22: రాష్ట్రంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇల్లందు ప్రాంతంలో పరిశోధనలు చేసి 1871లో బొగ్గు నిక్షేపాలున్నట్లు గుర్తించింది. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ తవ్వకాలు ప్రారంభించింది. ఇల్లందు సమీపంలోని సింగరేణి గ్రామంలో తొలిసారిగా 1889లో ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. 1920 డిసెంబర్ 23న హైదరాబాద్ దక్కన్ కంపెనీ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మారింది. ప్రస్తుతం ఆరు జిల్లాల్లో 11 ఏరియాల్లో బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తున్నది. దీంతో పాటు ఇతర రాష్ర్టాలతో పాటు విదేశాలకు విస్తరిస్తున్నది. బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు, సంస్థకు కావాల్సిన వస్తు సామగ్రిని సైతం సొంతంగా తయారు చేసి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది.
జైపూర్ ఎస్టీపీపీలో 1200 మెగావాట్ల విద్యుత్ తయారీ కేంద్రం ఉంది. అందులోనే మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. సింగరేణి వ్యాప్తంగా నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్లలో భాగంగా నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్లను కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయంపై ఏర్పాటు చేయనున్నది. సింగరేణి వ్యాప్తంగా 550 మెగావాట్ల(డీసీ)ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జైపూర్ ఎస్టీపీపీపీలో 10 మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఒడిశాలో రాష్ట్రంలో సింగరేణి సంస్థ ప్రారంభించనున్న నైనీ బ్లాక్‌లో మొత్తం 340 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా ఈ గని నుండి ఏడాదికి 10 మిలియన్ టన్నుల చొప్పున 38 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేయనుంది. దేశంలో తొలిసారిగా భూగర్భం నుంచి ఉబికి వచ్చే వేడి నీటితో విద్యుత్‌ను తయారు చేసే (జియోథర్మల్) కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. మణుగూరు ఏరియా పరిధిలోని పగిడేరులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీరాంపూర్/ మందమర్రి/ రెబ్బెన, డిసెంబర్ 22 : సింగరేణి ఆవిర్భావ దినోత్సవానికి శ్రీరాంపూర్‌లోని ప్రగతి స్టేడియం, మందమర్రి ఏరియాలో మందమర్రిలోని సింగరేణి పాఠశాల మైదానం, బెల్లంపల్లి ఏరియాలో గోలెటిలోని భీమన్న క్రీడా మైదానం ముస్తాబైంది. ఫుడ్ స్టాళ్లు, సూపర్ బజార్ స్టాల్, ఎంవీటీసీ, రె స్క్యూ, వైద్యారోగ్య శాఖ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వేడుకలతో పాటు స్టాళ్ల ఏర్పాట్లను శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎల్వీ సూర్యనారాయణ, మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, బెల్లంపల్లి జీఎం శ్రీనివాస్, అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పరిశీలించారు. వేడుక ల్లో భాగంగా సోమవారం ఉదయం సింగరేణి జెండా ఆవి ష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీల్లో విజేతల కు బహుమతులు ప్రదానం ఉంటుందని అధికారులు తెలిపా రు. వేడుకల్లో కార్మికులు, అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.