కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న తిర్యాణి ప్రాంతం ఇప్పుడు శాంతికి నిలయంగా మారుతున్నది. పోలీసులు ప్రత్యేక చొరవ చూపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండగా, యువత స న్మార్గంలో నడుస్తున్నది. ఇటీవల అక్కడి పోలీస్‌స్టేషన్‌ను గ్రంథాలయంగా మార్చి.. అనేక పుస్తకాలు అందుబాటులోకి తీసుకురాగా, గి రిబిడ్డలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దట్టమైన అడవులతో ఉన్న తిర్యాణి ప్రాంతమంతా ఒకప్పు డు మావోయిస్టులకు సేఫ్‌జోన్‌గా ఉండేది. మావోయిస్టులు ఎక్కడ ఉంటారంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఆ మారుమూల గిరిజన గ్రామమే. అక్కడ విధులు నిర్వహించాలంటే పోలీసులు కూడా భయపడే పరిస్థితి ఉండేది. మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకోవడంతో పాటు నిరుద్యోగ యువతను పెద్ద సంఖ్యలో మావోయిస్టుల్లో చేర్చుకునేందుకు రిక్రూట్మెంట్లు సైతం ఇక్కడ జరిగేవి. దళాల్లో కొత్తగా చేరిన యువకులకు కావాల్సిన శిక్షణ కూడా తిర్యాణి మండలం మంగీ ప్రాంతంలోనే ఇచ్చేవారు. మంగీ దళం అంటే రాష్ట్రంలోనే పేరుగాందించి. మావోయిస్టులకు మంచి పట్టున్న ఈ ప్రాంతంలో పోలీసులు విధులు నిర్వహించేందుకు జంకేవారు.
1995లో తిర్యాణి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో పోలీస్‌స్టేషన్ పాక్షికంగా దెబ్బతిన్నది. మావోయిస్టు రాష్ట్ర కమిటీ నేతలు వర్గీస్, శోభన్, విజయ్, అక్రంలు మంగీదళంలోని సభ్యులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవారు. దాదాపు ఐదేళ్ల క్రితం మావోయిస్టు మంచిర్యాల-తిర్యాణి జిల్లాల ఇన్చార్జి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకునేందుకు పర్యటించారు. అప్పట్లో సుమారు రెండు నెలలపాటు తిర్యాణి, లింగాపూర్, సిర్పూర్ మండలాల్లోని అడవుల్లో సంచరించారు. పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి కూబింగ్లు నిర్వహించడంతో రెండుసార్లు పోలీసుల నుంచి అడెల్లు తృటిలో తప్పించుకున్నాడు. తర్వాత కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోవడంతో అప్పటి నుంచి జిల్లాలో మావోయిస్టుల సంచారం పూర్తిగా తగ్గిపోయింది. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న తిర్యాణి ప్రాంతంలో ప్రస్తుతం పూర్తిగా కనుమరుగయ్యారు.
1995లో మావోయిస్టు పేల్చివేతకు గురైన తిర్యాణి పోలీస్‌స్టేషన్ ఇప్పుడు యువతకు విజ్ఞానాన్ని అందించే లైబ్రరీగా మారింది. ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ చొరవతో పోలీస్‌స్టేషన్‌ను లైబ్రరీగామార్చారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే నిరుద్యోగ గిరిజన యువతకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. గిరిజన యువతతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వారిలో మార్పు తీసుకొస్తున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తేనే భయపడిపోయిన గిరిజనులు ఇప్పుడు పోలీసులతో మమేకమై శాంతియుత వాతావారణాన్ని నెలకొల్పుతున్నారు.
మావోయిస్టులకు పేరుగాంచిన తిర్యాణి ప్రాంతంలో ఇప్పుడు పోలీసుల సేవా కార్యక్రమాల వల్ల యువత పెడదారి పట్టకుండా సన్మార్గంలో నడుస్తున్నది. పోలీస్‌స్టేషన్‌గా మారిన లైబ్రరీలో నిత్యం పదుల సంఖ్యలో యువకులు ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్నారు. మొత్తానికి పోలీసులు చేపడుతున్న సేవా కార్యక్రమాలు వారి బతుకుల్లో మార్పును తీసుకొస్తుండగా, అడవిబిడ్డలు వారిని ప్రశంసిస్తున్నారు.