కెరమెరి, ఆగస్టు 24 : కెరమెరి అడవుల్లో సంచరిస్తున్నది ‘పులి’యేనని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు నిర్ధారించారు. ఉమ్రి గ్రామంలో ఓ రైతు చేనులో కనిపించిన పాదముద్రలను ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్ పరిశీలించి పులి అడుగులుగా గుర్తించారు. ఇంతకాలం పల్లెల్లో దాడులు చేస్తున్నది పులియేనా.. లేక చిరుతనా.. తెలియక అధికారులు సతమతమయ్యారు.
అడవుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. ఇటీవల దేవాపూర్ అటవీ ప్రాంతంలో మేక, పరందోలి గ్రామంలో రెండు కుక్కలపై దాడి జరగగా, తాజాగా శనివారం బోరిలాల్గూడలో మేకను హతమార్చింది. మధ్యాహ్నం రాజుకు చెందిన మేక పాకలో కనిపించకపోయే సరికి కొంతమంది అటవీ ప్రాంతంలో వెతికారు. అటవీప్రాంతంలో మేకను పూర్తిగా తినేసి వదిలేసిన కళేబరం కనిపించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజల్లో భయం పెరిగింది.
జన్నారం, ఆగస్టు 24 : కవ్వాల్ టైగర్ రిజర్వుడు అడవుల్లో పెద్దపులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం అడవికి వెళ్లిన ఆవుదూడపై పులి దాడి చేయగా, అది ప్రాణాలతో బయటపడింది. పశువుపై దాడి చేసింది ఏ జంతువు అనే కోణంలో అటవీ అధికారులు, యానిమల్ ట్రాకర్స్ అన్వేశించారు. ఈ నేపథ్యంలో జన్నారం డివిజన్ అడవుల్లో పెద్దపులి అడుగులను గుర్తించడంతో పూర్తి స్పష్టత వచ్చింది. కవ్వాల్ అడవుల్లో పెద్దపులి ఆవాసం ఏర్పాటు చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.