ఖానాపూర్/ లక్ష్మణచాంద/జైనథ్/ఇంద్రవెల్లి /దస్తురాబాద్ మే 27 : ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. అన్నదాతలను అతలాకుతలం చేసింది. ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వరంలోని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వడ్లు, మక్కలు,
జొన్నలు తడిసిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన బస్తాలను చూసి రైతన్నలు కంటతడిపెట్టారు. ఖానాపూర్ మండలంలో కొన్ని రోజులుగా వడ్ల కొనుగోళ్లు మందకొడిగా సాగుతుండడంతో రైతులు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన గాలివానతో కొనుగోలు
కేంద్రాల్లో సరిపడా టార్పలిన్ కవర్లు అందుబాటులో లేకపోవడంతో కళ్లముందే వడ్లు, మక్కలు తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సకాలంలో టార్పాలిన్లు సరఫరా చేయకపోవడం, బస్తాలను సకాలంలో మిల్లులకు తరలించకపోవడంతోనే తమకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు. తడిసిన వడ్లను ఎలాంటి షరతులు లేకుండా, మద్దతు ధర కే ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.లక్ష్మణచాంద మండలంలో గన్నీ బ్యాగులు, లారీ కొరతతో వివిధ గ్రామాల్లో పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వడ్ల బస్తాలు రాత్రి కురిసన
వర్షానికి తడిశాయి. ఐకేపీ సెంటర్ యాజమాన్యం, అధికారులు, లారీ యజమానుల నిర్లక్ష్యం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈదురు గాలుల ధాటికి ఖానాపూర్లోని అంబేదర్ నగర్ శివారులో కొత్త ప్లాట్ల కాలనీలో విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై పడింది. మసాపూర్లో ఇగ్లూ థియేటర్ ముందు విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు వ్యాపార, వాణిజ్య సముదాయాల్లోని దుకాణాల బోర్డులు కొట్టుకుపోయాయి. కొన్ని ఇళ్లపై వాటర్ ట్యాంకులు, రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. పట్టణంలోని శ్రీరామ్ న గర్ కాలనీలో బోగు రవి ఇంటి పైకప్పు కొట్టుకపోయింది. రవితోపాటు అతని భార్య హేమలత, కుమారుడు నందు గాయపడ్డారు. దస్తురాబాద్ మండలంలో మున్యాల -గొడిసేర్యాల గ్రామాల మధ్య ఉన్న చెట్లు రోడ్డుపై విరిగి పడ్డాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది.
ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని మేడిగూడ(ఆర్) గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి 13 వేల క్వింటాళ్ల జొన్న పంట నిల్వలు తడిసి ముద్దయ్యాయి. ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పక్షం రోజులైనా గన్ని బ్యాగులు, లారీలు,
గోదాముల కొరతతో జొన్న పంట నిల్వలు అక్కడే పేరుకపోయాయి. ఇంద్రవెల్లి మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో జొన్న పంటను కాపాడుకోడానికి టార్పాలిన్ కప్పుతూ రైతులు ఇబ్బంది పడ్డారు. కొంతమంది రైతులు జొన్న పంటను సంచుల్లో నింపేందుకు అవస్థలు పడ్డారు.
అయినప్పటికీ బస్తాలు తడిసిపోవడంతో ఆందోళనకు గురయ్యారు.
ఖానాపూర్ : నేను ఏడు ఏకరాల్లో వరి సాగు చేసిన. వడ్లను తెచ్చి 10రోజులైతున్నది. లారీల కొరత, హమాలీల కొరత కారణంగా ఇప్పటి వరకు కాంటా చేయలేదు. వర్షానికి వడ్లు తడవకుండా కాపాడేందుకు తిప్పలు పడుతున్నం. వడ్లు అయితే అమ్ముడు పోతలేవు. వానకాలం సీజన్ వ స్తున్నది. దుక్కులు దున్నే
పనులున్నయ్. అధికారులు పట్టించుకొని వడ్లు కొనాలే.
– అడెపు నర్సయ్య, రైతు, (ఖానాపూర్)
జైనథ్ : నాకు ఈ యేడు 95 బస్తాల జొన్న పంట వచ్చింది. 50 క్వింటాళ్ల పంట ఆరు బయటే రైతు భవనం పక్కన పోసికొని వారం రోజులైంది. గన్నీ సంచుల కోసం.. లారీల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. రెండ్రోజుల నుంచి మబ్బులు పట్టినయ్. కానీ రాత్రి కురిసిన వానతో జొన్న పంట తడిసింది. ఇప్పటికైనా
సర్కారు పట్టించుకొని లారీలను తెచ్చి జొన్నలను తరలించాలి.
– గొర్ల శంకర్, రైతు, మేడిగూడ
జైనథ్ : నాకు ఈ యేడు వంద క్వింటాళ్ల జొన్న పంట దిగుబడి వచ్చింది. వారం రోజుల కింద గోదాం వద్దకు జొన్నలు తెచ్చిన. గన్నీ బ్యాగులు దొరక లేదు. లారీలు కూడా రాకపోవడంతో ఆరు బయటే జొన్న నిల్వలు పేరుకుపోయాయి. మంగళవారం రాత్రి కురిసిన వానకు జొన్న పంట పూర్తిగా నానిపోయింది. ఇప్పటికైనా గవర్నమెంట్ పట్టించుకొని లారీలను తెప్పించి జొన్నలను తీసుకెళ్లాలి.
– మెస్రం భగ్గు, రైతు, తోయగూడ