ఆదిలాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) ః ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి ‘ముందు నుయ్యి, వెనుక గొయ్యి’లా తయారైంది. మార్కెట్ యార్డుకు తీసుకొస్తున్న జొన్న పంటను కొనుగోలు చేయడంతో జాప్యం ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు ఆదిలాబాద్, ఆదిలాబాద్ రూరల్, మావల, తలమడుగు, భోరజ్, సాత్నాల మండలాలకు చెందిన రైతులు జొన్నలను విక్రయించడానికి వస్తున్నారు.
20 రోజుల కిందట ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో మద్దతు ధర క్వింటాలుకు రూ.3371 చొప్పున జొన్నలను సేకరిస్తున్నది. దిగుబడి బాగా రావడంతో మార్కెట్ యార్డు జొన్నల రాశులతో కళకళలాడుతున్నది. కొనుగోలు కేంద్రాల సిబ్బంది తేమ, నాణ్యత పేరిట కొనుగోళ్లను తిరస్కరిస్తున్నారు. కొనుగోలు చేసిన జొన్నలను లారీల్లో గోదాములకు పంపడంలో ఆలస్యం అవుతున్నది.
పంట దొంగల పాలు
పంట కొనుగోళ్లలో జాప్యం ఫలితంగా రైతులు నష్టపోవాల్సి వస్తున్నది. పంటను అమ్ముకునేందుకు రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డులో పడిగాపులు కాయాల్సి వస్తున్నది. పీఏసీఎస్ తిరస్కరించిన జొన్నలను ఆరబెట్టడం, జల్లెడ పట్టడం, జొన్నల సంచులు ఖాళీ అయ్యేంత వరకు మార్కెట్ యార్డులోనే ఉండాల్సి వస్తుంది. కష్టపడి సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు మార్కెట్ యార్డులో రాత్రి, పగలు పంటకు కాపలా కాస్తున్నారు.
మార్కెటింగ్ శాఖ అధికారులు పంటతోపాటు రైతులకు భద్రత కల్పించకపోవడంతో దొంగలు పెట్రేగిపోతున్నారు. రాత్రి సమయంలో పంటను ఎత్తుకుపోతున్నారు. అడ్డుకున్న రైతులపై దాడులకు పాల్పడుతున్నారు. బుధవారం రాత్రి దొంగలు సాత్నాల మండలంలోని రాంపూర్‌కు చెందిన దిలీప్‌రెడ్డి, తలమడుగు మండలం బరంపూర్‌కు చెందిన నారాయణలపై బండలు, కట్టెలతో దాడి చేయడంతో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. దొంగల వల్ల భయం ఉందని మార్కెటింగ్ సిబ్బందికి పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు తెలిపారు. పంట దొంగలపాలు కాకుండా కొనుగోళ్లను వేగవంతం చేయడంతోపాటు భద్రత సిబ్బందిని నియమించాలని రైతులు కోరుతున్నారు.
దొంగలు కొట్టారు.. తలకు గాయమైంది..
నేను 15 క్వింటాళ్ల జొన్నలను అమ్మడానికి సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చా. పంటను కొనమని పీఏసీఎస్ సిబ్బందిని వేడుకున్న పట్టించుకోలేదు. దీంతో పంటకు కాపలాగా హోటల్ నుంచి తిండి తెచ్చుకుంటూ పంటకు కాపలాగా ఇక్కడే ఉంటున్నా. బుధవారం రాత్రి దొంగలు పంటను ఎత్తుకుపోవడానికి వచ్చినప్పుడు వారు నాపై దాడి చేశారు. తలకు గాయాలయ్యాయి. మార్కెట్ యార్డులో రైతులకు భద్రత లేదు. పంట కొనగోళ్లలో జాప్యం జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటే రైతులకు ఇబ్బందులు ఉండవు.
– దిలీప్‌రెడ్డి, రైతు, రాంపూర్, సాత్నాల మండలం