మంచిర్యాల, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు సహా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో కొత్త పాలకవర్గాలు నేడు కొలువు తీరనుండగా, యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఇక చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఎవరిని వరిస్తాయి, మంచిర్యాల మేయర్ ఎవరవుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొన్నది.
ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు చెన్నూర్, లక్షెట్టిపేట, నిర్మల్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో తప్ప మిగిలిన అన్ని ఆరు మున్సిపాలిటీల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేదు. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ చైర్మన్ పదవులపై ధీమాతో ఉన్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్, భైంసాలోనూ హంగ్ ఏర్పడింది. దీంతో ఈ మున్సిపాలిటీల్లో ఏం జరుగుతుంది. ఎవరు మున్సిపాలిటీలు దక్కించుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీల్లో ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇక్కడ ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది. హంగ్ ఉన్న మున్సిపాలిటీల్లో మ్యాజిక్‌ఫిగర్ చేరుకోడానికి అవసరమైతే ఎక్స్ అఫీషియో ఓట్లు వినియోగించుకోడానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇలాంటి ఉత్కంఠ పరిస్థితుల్లో పురపీఠాలు ఎవరిని వరిస్తాయన్నది సోమవారం తేలిపోనున్నది.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడ్డాక తొలిసారి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ, మేయర్ పదవి కోసం ఆ పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొన్నది. బీసీ జనరల్‌కు మేయర్ రిజర్వ్కావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి 31 మంది బీసీలు గెలుపొందడం తో నేనంటే నేనే మేయర్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బైపాస్ రోడ్డు ప్రాంతం నుంచి చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకొని గెలిచిన ఓ కార్పొరేటర్.. ‘నేను పార్టీకి రూ.40 లక్షల ఫండ్ ఇచ్చాను. గెలిస్తే మేయర్‌ని చేస్తా’ అని ఎమ్మెల్యే చెప్పారంటూ ఇంటింటి ప్రచారంలో చెప్పుకున్నాడు. శ్రీరాంపూర్ ఏరియా నుంచి గెలిచిన ఓ కార్పొరేటర్ నేనే మేయర్ అంటూ ప్రచారం చేశారు.
నస్పూర్ ప్రాంతానికి చెందిన మరో లీడర్ నా కు పార్టీ పెద్ద నుంచి దాదాపు రూ.6 కోట్లు పెండింగ్ బిల్లులు రావాలని, వాటికి బదులు నాకే మేయర్ పదవి ఇస్తారని, అవసరమైతే మరికొన్ని డబ్బులు ఇస్తానంటూ చెప్పుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యే తర్వాత మేమే పార్టీకి అన్ని.. అని ఎమ్మెల్యే షాడోలుగా ఉన్న ఇద్దరు, ముగ్గురు లీడర్లు సైతం మేయర్ పదవిపై ఆశతో ఉన్నారు. ఇక ఓ సామాజిక వర్గానికి చెంది న నాయకులు మేము 9 మంది గెలిచామని, మా సామాజిక వర్గానికే మే యర్ ఇవ్వాలంటూ ఆ వర్గం నాయకులు పట్టుబడుతున్నట్లు తెలిసింది. కాగా, వీరెవరిని కాకుండా మహిళను తొలి మేయర్ సీటుపై కూర్చోబెట్టే ఆలోచనలో ఎమ్మెల్యే ఉన్నారంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నా రు. తీవ్రమైన పోటీ నేపథ్యంలో నేడు మేయర్ పీఠంపై స్పష్టత రానుండగా, ఆ తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారనున్నాయి.
బెల్లంపల్లిలో పీఠముడి… కొనసాగుతన్న ఊగిసలాట
బెల్లంపల్లిలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాంగ్రెస్‌కు సంపూర్ణమైన మెజార్టీ తీసుకురాలేకపోయారు. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రె స్ సమానమైన సీట్లు సాధించగా, తాజాగా గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేశారు. బెల్లంపల్లి 26వ వార్డు కౌన్సిలర్ ఇప్ప కుమారస్వామితో పాటు, 30వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ తండ్రి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్‌సింగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరితో పాటు 34వ వార్డులో బీజేపీ కౌన్సిలర్‌గా గెలిచిన కొక్కెర రాంమూర్తి కేటీఆర్‌ను కలిసి బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు మద్దతు ఇస్తానని చెప్పారు. దీంతో బెల్లంపల్లిలో బీఆర్ఎస్ బలం ఇప్పటికే 17కు చేరింది.
కాగా, మరో ఇద్దరు కౌన్సిలర్లు సైతం బీఆర్ఎస్ లో చేరే అవకాశాలుండడంతో బెల్లంపల్లి మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్‌ను బీఆర్ఎస్ దాటిపోనున్నది. దీంతో అధికారంలో ఉండి కూడా బెల్లంపల్లిని చేజార్చుకుంటున్నారనే చర్చ స్థానికంగా జోరుగా నడుస్తున్నది. కాగా, ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నా.. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ పాగా వేయడం ఖాయంగా కనిపిస్తున్నది. అయితే, అధికార పార్టీ మాత్రం గెలిచిన కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు ప్రలోభపెట్టే పనులకు పదునుపెట్టినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన నాయకులను సైతం ఇబ్బందులు పెడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో బెల్లంపల్లి మున్సిపాలిటీ విషయంలో ఊగిసలాట కొనసాగుతున్నది.
హంగ్ ఉన్న మున్సిపాలిటీలను దక్కించుకోవడం కోసం అధికార పార్టీ ఎంతకైనా తెగిస్తుందన్న ఆరోపణలున్నాయి. ఆసిఫాబాద్‌లో మొన్న గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిని కౌంటింగ్ హాల్ నుంచి ఎత్తుకెళ్లారు. ఈ మున్సిపాలిటీలో అధికార పార్టీ కౌన్సిలర్లు ఏడు సీట్లలో గెలిస్తే, బీఆర్ఎస్ 9 సీట్లలో గెలిచింది. ఒక్క ఇండిపెండెంట్‌ను కలుపుకుంటే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ దక్కించుకునే అవకాశాలున్నాయి. దీంతో అధికార పార్టీ బలవంతంగా గెలిచిన స్వతంత్రులను ఎత్తుకెళ్లిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక కాగజ్‌నగర్‌లో బద్ధ శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ పార్టీ లు రెండూ కలిసి చైర్మన్‌ను ఎన్నుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
పైకి శత్రువులుగా నటిస్తూ.. లోలోపల మిత్రులుగా ఉంటూ బీఆర్ఎస్కు చైర్మన్ పదవి దక్కకూడండా ఉండేందుకు కుట్రలు పన్నుతున్నాయి. బె ల్లంపల్లిలో కాంగ్రెస్‌కు మెజార్టీ రాలేదు. దీంతో ఎలాగైనా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. మమ్ములను కాదని బీఆర్ఎస్లోకి వెళ్తే అంతుచూస్తామంటూ బెదిరింపులకు పాల్పడడంతో పాటు, మరికొందరికి కాంట్రాక్ట్ పనులన్నీ మీకే ఇస్తామంటూ ఎర వేస్తున్నట్లు తెలిసింది. ఇలా మున్సిపాలిటీలను దక్కించుకోవడం కోసం అధికార పార్టీ దౌర్జన్యాలు, బెదిరింపులకు తెరలేపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.