ఆదిలాబాద్, జనవరి 16(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణంలోని 33వ వార్డులో 200 మంది రేషన్‌కార్డు లేని వారు ఉన్నారు. వీరిలో చాలా మంది కూలీ పనులు, కులవృత్తులు, చిరు వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రేషన్‌కార్డుల అర్హుల క్షేత్రస్థాయి పరిశీలన జాబితాలో కేవలం 53 మంది పేర్లు మాత్రమే వచ్చాయి. వీరందరూ రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాలతోపాటు ప్రజాపాలనలో దరఖాస్తులు సమర్పించారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో తమకు రేషన్‌కార్డు లేదని సర్వేకు వచ్చిన సిబ్బందికి సూచించారు. రేషన్‌కార్డు వస్తుందని ఎదురుచూస్తున్న వీరికి నిరాశే మిగిలింది. తన వార్డులో 200 మంది పేదలు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న, కులగణనలో వివరాలు రాయించిన వారి పేర్లు జాబితాలో లేవని వార్డు కౌన్సిలర్ అలాల అజయ్ తెలిపారు. పేదలు రేషన్‌కార్డుల జాబితాలో తమ పేర్లు లేవని అడుగుతున్నారని, ఏమి సమాధానం చెప్పలేక పోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రధాన వార్డు కౌన్సిలర్ తమ వార్డులోని 400 మంది వరకు పేదలు ఉన్నారని, జాబితాలో కేవలం 43 మంది పేర్లు మాత్రమే వచ్చాయని, ఇలా ఎందుకు జరిగిందని మున్సిపాలిటీకి వచ్చి కమిషనర్‌తో మొర పెట్టుకున్నారు. పట్టణంలోని 49 వార్డుల్లో కూడా రేషన్‌కార్డుల జాబితా పరిస్థితి ఇలాగే ఉంది. జిల్లావ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తులు సమర్పించగా.. కేవలం 18,741 మందికి రేషన్‌కార్డుల లబ్ధిదారుల ఎంపిక జాబితాలో పేర్కొన్నారు. జాబితాలో చాలా మంది పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో పరిశీలనకు వచ్చిన సిబ్బందిని తమ పేర్లు ఉన్నాయా అని తెలుసుకుంటున్నారు. జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవని సిబ్బందిని అడిగితే గ్రామసభలో దరఖాస్తు ఇవ్వాలని చెబుతున్నారని దరఖాస్తుదారులు అంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చి జాబితాలో తమ పేర్లు లేవంటూ ఆందోళన చెందుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు ఏమి చేయాలో తెలియడం లేదు.
కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతాం. రేషన్‌కార్డు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు ఇవ్వడంతోపాటు కులగణన సర్వే కోసం వచ్చిన సిబ్బందికి రేషన్‌కార్డు లేదని వివరాలను తెలిపాం. కార్డు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాం. మా వార్డుకు వచ్చిన మున్సిపల్ సిబ్బంది వద్ద ఉన్న జాబితాలో మా పేర్లు లేవు. ఎవరిని సంప్రదించాలో తెలియడం లేదు. ప్రభుత్వం పేదలందరికీ రేషన్‌కార్డులు అందజేయాలి.
ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు పంపిణీ చేయాలి. ప్రభుత్వ పథకాల ఎంపికలో రేషన్‌కార్డును పరిగణలోకి తీసుకోవడంతో పేదలు నష్టపోతున్నారు. మా వార్డులో 200 మంది ప్రజాపాలన, కులగణన సర్వే సిబ్బందికి వివరాలను అందించారు. ప్రభుత్వం విడుదల చేసిన క్షేత్రస్థాయి పరిశీలన జాబితాలో మా వార్డులో కేవలం 53 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. అధికారులను అడిగితే ప్రభుత్వం పంపిన జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక చేస్తామని అంటున్నారు. ప్రజలు మా వద్దకు వచ్చి జాబితాలో తమ పేర్లు లేవని అడుగుతున్నారు. ఏమని సమాధానం చెప్పాలో తెలియడం లేదు .
మేము కూలీ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతాం. రేషన్‌కార్డులేక బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలు పొందడం లేదు. రేషన్‌కార్డు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. మీ సేవ, ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చినం. కులగణనలో కూడా సర్వే కోసం వచ్చిన సిబ్బందికి వివరాలు తెలిపాం. రేషన్‌కార్డుల పరిశీలనకు వచ్చిన వారి వద్ద ఉన్న జాబితాలో మా పేర్లు లేవు. అధికారులు స్పందించి రేషన్‌కార్డు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.