ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1527 పంచాయతీలుండగా, పన్నుల వసూళ్లలో రికార్డులు సృష్టిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 28.28 కోట్లు జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, యంత్రాంగం ఇప్పటికే 22.84 కోట్లు వసూలు చేసింది. మరో 22 రోజుల గడువే ఉండగా, మిగతా రూ. 5.44 కోట్లు సేకరించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నది. పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో గ్రామాల్లో తిరుగుతూ వందశాతం పూర్తి చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నది.
– మంచిర్యాల, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, మార్చి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రాపర్టీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వసూళ్లలో గ్రామ పంచాయతీలు రికార్డ్లు నమోదు చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1527 పంచాయతీలుండగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.28.28 కోట్ల పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.22.84 కోట్ల పన్నులు వసూలయ్యాయి. మరో 22 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో మిగిలిన పన్నుల వసూళ్లపై పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో తిరుగుతూ వసూలు చేయనున్నారు. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో రూ.8.54 కోట్లు వసూలు లక్ష్యం కాగా, ఇప్పటికే రూ. 7.13 కోట్లు వసూలయ్యాయి. నిర్దేశించుకున్న లక్ష్యంలో మంచిర్యాల జిల్లాలో రూ.1.46 కోట్లు, ఆసిఫాబాద్లో రూ.1.18 కోట్లు, ఆదిలాబాద్లో రూ.1.39 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
ఆసిఫాబాద్, మార్చి 9 : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో వందశాతం పన్నుల వసూలే లక్ష్యంగా యంత్రాంగం కార్యాచరణ చేపడుతున్నది. ఈ నెలాఖరులోగా టార్గెట్ పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాలో 335 పంచాయతీలుండగా, ఈసారి రూ.4,73,58,200 వసూలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటికే రూ. 3,55,10,163 వసూలు చేశారు. అత్యధికంగా లింగపూర్ మండలం 97.66 శాతంతో ముందుంది. కౌటాల మండలం 64.04 శాతంతో చివరి వరుసలో ఉంది. మార్చి 31లోగా వందశాతం పన్నులు వసూలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించింది. జిల్లాలో ఇప్పటి వరకు నిర్దేశించిన లక్ష్యంలో 74.98 శాతం పన్నులు వసూలు చేశారు. మరో 22 రోజుల్లో 100 శాతం పూర్తి చేసేందుకు కృషిచేస్తున్నారు.
నెలాఖరులోగా 100 శాతం పూర్తి చేస్తాం..
ఆసిఫాబాద్ జిల్లాలో వందశాతం పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 74.98 శాతం పన్నులు వసూలు చేశాం. ఇందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ నెలాఖరులోగా 100 శాతం పూర్తి చేస్తాం. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి.
– రమేశ్, డీపీవో, ఆసిఫాబాద్