ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో దొంగలు ఓ ఇంటిలో చొరబడి బంగారం, నగదును దోచుకెళ్లారు. మండల కేంద్రంలోని ఫూలాజీబాబా ధ్యాన కేంద్రానికి సమీపంలో మండలి బక్కన్న ఇంట్లో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు. బక్కన్న, అతడి భార్య మహారాష్ట్రలో శుభకార్యానికి వెళ్లారు.
గమనించిన దొంగలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం రాత్రి దొంగలు ఇంటి కిటికిని తొలగించి లోనికి చొరబడి బీరువాను ధ్వంసం చేశారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారం, రూ.లక్షా 50 వేల నగదును దోచుకెళ్లారు. శనివారం ఇంటికి వచ్చిన బాధిత కుటుంబం చోరీకి గురైన విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు.
బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. దొంగను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించి విచారణ చేపట్టామని, కొన్ని ఆధారాలు సేకరించామని వెల్లడించారు.