Agriculture | దస్తురాబాద్, ఫిబ్రవరి 21 : వ్యవసాయ మోటర్ల వద్ద ఆటో మెటిక్ స్టార్టర్లను వాడడం వల్ల తీవ్ర అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన విద్యుత్ నష్టంతో పాటు సాగునీరు వృథాగా పోతుంది. దీనివల్ల భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. ఆటోమెటిక్ స్టార్టర్లు అమర్చుకోవడం వల్ల భూగర్భ జలాలు అడుగు భాగంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. వ్యవసాయ మోటర్ల వద్ద కొంతమంది రైతులు పని సులువవుతుందని ఆటోమెటిక్ స్టార్టర్లను అమర్చుకుంటున్నారు. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నా రైతులు వారి పనులపై బిజీగా ఉంటుండడంతో వ్యవసాయ పంపుసెట్ల వద్ద ఆటో స్టార్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. మార్కెట్లో ఇవి తక్కువ ధరకు లభిస్తుండడంతో రైతులు వీటివైపే మొగ్గుచూపుతున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆటోమెటిక్ స్టార్టర్లను పెట్టడంతో కలిగే నష్టాలను రైతులకు అధికారులు వివరిస్తున్నా కొంత మంది పెడచెవిన పెడుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్, నీటి వృథాను అరికట్టాలని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లాస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కిందిస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. వీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వ్యవసాయ మోటర్ల వద్ద రైతులు పెట్టుకున్న ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించాలని మొదటగా సంబంధిత రైతులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వారు ఇచ్చిన గడువులోగా ఆటో స్టార్టర్లను తీసేయకుంటే అధికారులు నేరుగా వ్యవసాయ మోటర్ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. రైతులు ఆటో స్టార్టర్లు అమర్చుకున్న చోట తొలగిస్తున్నారు. ఎక్కువగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని రైతులు ఈ ఆటో మెటిక్ స్టార్టర్లను వాడుతున్నారని తమ పరిశీలనలో తెలిసిందని అధికారులు పేర్కొంటున్నారు. మండలంలో 2,209 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. వీటిలో ఇప్పటి వరకు మండలంలోని వ్యవసాయ క్షేత్రాల్లో తనిఖీలు చేపట్టి దాదాపు 260 ఆటో మెటిక్ స్టార్టర్లను తొలగించినట్లు తెలిపారు.
వ్యవసాయ పంపు సెట్ల వద్ద ఆటో మెటిక్ స్టార్టర్లను ఉపయోగించడం వల్ల అధిక నష్టం వాటిల్లుతుంది. వీటిని అమర్చుకోవడం ద్వారా ప్రభుత్వం అధిక ధరకు కొనుగోలు చేసిన విద్యుత్, భూగర్భ జలాలు సైతం వృథా అవుతాయి. ఆటోమెటిక్ స్టార్టర్లు నిరంతరం నడవడం వల్ల పక్క వ్యవసాయ బావులు, బోర్లు, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సాగవుతున్న పంటలకు నీటి కొరత ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆటో మెటిక్ స్టార్టర్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. నేరుగా అధికారులు వ్యవసాయ మోటర్ల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటికే మండలంలో దాదాపు 260 ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగించారు. మిగిలిన వాటిని సైతం త్వరలోనే తొలగించేలా చర్యలు తీసుకోనున్నారు.
రైతులు ఆటోమెటిక్ స్టార్టర్లను అమర్చుకోవద్దు. ఆ స్టార్టర్లతో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. విద్యుత్ వృథా అవుతుంది. భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతాయి. అధికారులకు రైతులు సహకరించాలి. వ్యవసాయ పంపు సెంట్ల వద్ద ఏర్పాటు చేసుకున్న ఆటోమెటిక్ స్టార్టర్లను రైతులు తొలగించాలి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పర్యటించి మోటర్ల వద్ద తనిఖీ చేపడుతున్నాం. రైతులు అమర్చుకున్న ఆటోమెటిక్ స్టార్టర్లను తొలగిస్తున్నాం.
– కేశెట్టి శ్రీనివాస్, ఖానాపూర్ ఇన్చార్జి ఏడీఏ/ ఏఈ, దస్తురాబాద్