స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం అన్ని జిల్లాల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించిన అధికారులు రిజర్వేషన్ల ప్రక్రియకు తుదిరూపు ఇచ్చారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, జనరల్ రిజర్వ్ స్థానాల్లో మహిళలు పోటీ చేసే స్థానాలపై డ్రా నిర్వహించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు, ఆర్డీవో ఆధ్వర్యంలో ఎంపీటీసీ, సర్పంచి స్థానాలు, ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామ వార్డు మెంబర్ల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇలా ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారవుతుండగానే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై కోర్టులో పిటిషన్ వేసినట్లు వార్తలు రావడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు చేసిన రిజర్వేషన్లు ఉంటాయా? ఉండవా? అన్న సందిగ్ధత నెలకొన్నది.
– మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ)
రిజర్వేషన్లు ఖరారయ్యాయని సంబుర పడేలోపు అవి ఉం టాయో లేదో అన్న సందిగ్ధత నెలకొనడంతో ఆశావహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడన్న వార్త సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ఆశావహులు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 లోనే బీసీలకు 34 శా తం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేసింది. దానిపై అప్పుడున్న కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లారు. దీంతో రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదనే మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో విరుద్ధంగా ఉం దంటూ హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది.
కాంగ్రెస్ కోర్టుకు వెళ్లడంతో 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక సం స్థల ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో చేసిన కామారెడ్డి డిక్లరేషన్ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో విడుదల చే సింది. దీంతో ఎస్సీ, ఎస్టీలకు ఇప్పటికే అమలు చేస్తున్న 27 శా తం రిజర్వేషన్లు, బీసీలకు ఇస్తున్న 42 శాతం కలిపితే రిజర్వేషన్లు 69 శాతం దాటుతుందన్న వాదన తెరపైకి వచ్చింది. దీంతో నష్ట పోయామన్న భావనలో ఉన్న ఆశావహులు చాలా మంది నిరాశలో ఉండగా, కోర్టుకు ఆశ్రయిస్తారన్న ప్రచారం జరిగింది. చివరకు రిజర్వేషన్లు ఖరారైన రోజునే అధికార పార్టీ నాయకుడే హైకోర్టులో హౌజ్ మోషన్ ఫిటిషన్ దాఖలు చేశారన్న వార్తలు రావడంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ప్రభుత్వ హామీపై మొన్నటి వరకు స్పష్టత లేదు. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. దీంతో గత నెల లో మరోసారి అసెంబ్లీ బిల్లు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు శుక్రవారం జీవోను విడుదల చేసింది. ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామని ఆశపడిన అభ్యర్థుల ఆశలు గల్లంతయ్యాయి. ఖరారైన రిజర్వేషన్ల జాబితా చూసి కొందరు నిరాశతో వెళ్లిపోవడం కనిపించింది. జనరల్ వస్తుందనుకున్న స్థానాలు బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు వెళ్లడం పోటీ చేద్దామనుకున్న ఆశావహులకు అసంతృప్తి మిగిల్చింది. దీంతో కోర్టుకు వెళ్తామంటూ చాలా మంది బహిరంగంగానే మా ట్లాడుకోవడం శనివారం రాజకీయ పార్టీల సమావేశాల సందర్భంగా కనిపించింది.
రిజర్వేషన్ల కేటాయింపుపై కొంద రు నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. మెజార్టీ ప్రజల అభిష్టానికి అనుకూలంగా రిజర్వేషన్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల్లో బడుగు, బలహీన వర్గాలు రాజకీయాలవైపు చూసే రోజులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇప్పుడు ఖరారైన రిజర్వేషన్ల అమలును అడ్డుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, జిల్లాల్లో ఈ రోజు ఫైనల్ అయిన రిజర్వేషన్లను అనుసరించే గెజిట్ విడుదల చేయాలని కోరారు. కోర్టు తీర్పు ఏం ఇస్తుంది.. ఈ రిజర్వేషన్లు అమలవుతాయా? లేదా? అన్న దానిపై సందిగ్ధత నెలకొన్నది.