రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో 760, మావల జాతీయ రహదారిని ఆనుకొని 222 ఇండ్లను అపార్ట్మెంట్ తరహాలో సకల హంగులతో నిర్మించింది. మిషన్ భగీరథ నీరు, మురుగు కాలువలు, రహదారుల వంటి మౌళిక వసతులు సమకూర్చింది. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మొక్కలు నాటి, సంరక్షిస్తున్నది. కాగా, పనులను ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పర్యవేక్షిస్తున్నారు. ఇండ్ల కోసం 9,486 దరఖాస్తులు రాగా, 3,179 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. త్వరలోనే లక్కీ డ్రా పారదర్శకంగా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
ఆదిలాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో 4,195 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటికే పలు ఇండ్లు పూర్తికాగా, మిగతావి చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే 60 శాతానికి పైగా ఇండ్లను పంపిణీ చేశారు. ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెలు, కిరాయి ఇండ్లలో ఉంటున్న పేదలు, సర్కారు ఉచితంగా ఇచ్చిన గృహాల్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా నల్లానీరు, మురుగు కాలువలు, రహదారులు నిర్మిస్తున్నారు. ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా మొక్కలు నాటుతున్నారు.
ఆదిలాబాద్-నాగ్పూర్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న మావల వద్ద, మున్సిపాలిటీ పరిధిలోని కేఆర్కే కాలనీలో ప్రభుత్వం 982 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. పేదలు ఇబ్బందులు పడకుండా రోడ్లు, తాగు నీరు, కరెంటు ఇతర సౌకర్యాలు కల్పించింది. పట్టణానికి చెందిన పేదలు ఇండ్ల మంజూరుకు దరఖాస్తు చేసుకోగా.. ఇటీవల సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించారు. మొత్తంగా 9,486 దరఖాస్తులు రాగా, సభల్లో విచారణ జరిపి నిబంధనల ప్రకారం 3,179 మందిని అర్హులుగా గుర్తించారు. ఎంపిక చేసిన అర్హుల వివరాలను మున్సిపాలిటీలోని నోటీసు బోర్డుపై అంటించారు. లబ్ధిదారుల్లో ఎవరైన అనర్హులు ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సూచించారు. త్వరలో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూం ఇండ్లను పంపిణీ చేయడంపై పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.