మంచిర్యాల, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల సమరానికి సమయం వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఓకే చెప్పడం తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లెపోరుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 15వ తేదీలోగా ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతాయంటూ ప్రచారం జోరందుకున్నది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ముందు నిర్వహించి, అవయ్యా క సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని చెప్తున్నారు. అధికారులు మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ మేరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల పునర్విభజన కూడా పూర్తి చేశారు. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి మండలానికి ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉండాలన్న నిబంధన ఉంది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎంపీటీసీ సంఖ్య పెరిగింది. ఆదిలాబాద్‌లో జిల్లాలో గతంలో 158 ఎంపీటీసీలు ఉంటే ప్రస్తుతం 8 స్థానాలు పెరిగాయి.
జడ్పీటీసీలు 17 నుంచి 19కి పెరిగాయి. సోనాల, సాత్నాల రెండు కొత్త మండలాలు ఏర్పడడంతో స్థానాలు పెరిగాయి. ఇక నిర్మల్ జిల్లాలో 156 నుంచి 157 ఎంపీటీసీలకు పెరిగాయి. పెంబి మండలం వెంకంపోచంపాడు అనే ఎంపీటీసీ స్థానం పెరిగింది. జడ్పీటీసీలు గతంలో మాదిరి 18 ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో 123 ఉన్న ఎంపీటీసీ స్థానాలు 127కి పెరిగాయి. జిల్లాలోని రాజంపేట, సిర్పూర్(యూ) మండలాల్లోని రాఘవపూర్, లింగాపూర్ మండలంలోని కంచన్‌పల్లి, పెంచికల్పేట్ మండలంలోని కమ్మర్‌గాంలో ఎంపీటీసీ కొత్త స్థానాలు ఏర్పాటు చేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుతో హాజీపూర్ మండలంలోని గ్రామాల సంఖ్య తగ్గింది. దీంతో ఆ మండలంలో ఎంపీటీసీల సంఖ్య 9 నుంచి 6కి తగ్గింది. చట్ట ప్రకారం భీమారం, భీమి ని మండలాల్లో ఒక్కో స్థానం పెరిగింది. దీంతో మంచిర్యాల జిల్లా లో గతంలో 130 ఉన్న ఎంపీటీసీ స్థానాల సంఖ్య 129కి తగ్గింది.
అధికార పార్టీకి తలనొప్పిగా మారిన సర్వే.. రిజర్వేషన్లపై ఉత్కంఠ..
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కులగణన సర్వే లెక్కలు విడుదల చేయడం అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారనుంది. తప్పుల తడకగా సర్వే చేశారంటూ బీసీలు మండిపడుతున్నారు. స్థానిక సంస్థల్లో తమ రిజర్వేషన్‌ను తగ్గించే కుట్రలో భాగంగా జనాభాను తగ్గించి చూపించారనే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై కూడా మాదిగ, మాల సామాజిక వర్గాలు ఎవరికి వారు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయనే అంచనాలు వినిపిస్తున్నాయి. పైగా 13 నెలల పాలనపైనా జనం అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల పరిషత్‌ల ఎన్నికలను ముందు నిర్వహిస్తే.. అది కూడా మైనస్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతికూల ప్రభావం సర్పంచ్ ఎన్నికలపైనా పడుతుందని నిపుణులు అంటున్నారు. జిల్లా, మండల పరిషత్‌ల పాలకవర్గాలు ఖాళీ ఏర్పడి ఎనిమిది నెలలు గడిచింది.
ఇక గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల పదవీకాలం పూర్తయి ఏడాది పూర్తియ్యింది. చాలా కాలంగా గ్రామాలు, మండలాల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. ముందు పంచాయతీ ఎన్నికలా? లేక జిల్లా, మండల పరిషత్ ఎన్నికలా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఎన్నికల కోసం ఎదురు చూసే ఆశావహుల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. కులగణన సర్వే పూర్తవడంతో రిజర్వేషన్ల అంశంలో అన్ని సామాజిక వర్గాల నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. మా ఊరు రిజర్వేషన్ బీసీకి వస్తదా? ఎస్సీకి వస్తదా? జనరల్‌కు వస్తదా? మహిళలకు ఇస్తారా? అంటూ ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. గ్రామంలో గతంలో ఉన్న రిజర్వేషన్లు, గ్రామ జనాభా, రొటేషన్ పద్ధతిలో ఎవరికి ఇస్తారో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారై నోటిఫికేషన్ వస్తే స్థానిక సంస్థల ఎన్నికల సమరం రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి.
Hh