నిర్మల్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ) : పంచాయతీ పోరుకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసి, వచ్చే డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గ్రామ పంచాయతీలవారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. గతంలో ప్రకటించిన ఓటరు జాబితాలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సవరించి తుది జాబితాను ప్రచురించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం తుది ఓటరు జాబితాను పంచాయతీల్లో ప్రదర్శించే అవకాశం ఉంది.
ఈనెల 22,23 తేదీల్లో పంచాయతీలు, వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీంతో జిల్లాలోని పంచాయతీల రిజర్వేషన్లకు సంబంధించి అధికారులు కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. 50 శాతం రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకొనే అధికారులు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు సమాచారం. ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు.. అలాగే కులగణన ఆధారంగానే బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలి.
2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ రిజర్వేషన్లు కల్పించనున్నారు. నిర్మల్ జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇద్దరు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగినట్లు చెబుతున్నారు. భైంసా డివిజన్లో భైంసా సబ్‌కలెక్టర్ సంకేత్‌కుమార్, నిర్మల్ డివిజన్‌కు సంబంధించి నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణిల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేసి రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తున్నది. అలాగే రాజకీయ పార్టీల నేతల సమక్షంలో మహిళా రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో నిర్వహించినట్లు చెబుతున్నారు. ఏ పంచాయతీని ఎవరికీ కేటాయించారో అనే విషయం సోమవారం తేలనున్నది. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు పంచాయతీల రిజర్వేషన్ల వివరాలు సోమవారం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. దీంతో పంచాయతీ పోరులో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకునే ఆశావహుల రిజర్వేషన్ల ఉత్కంఠకు తెరపడనున్నది.
మొదటి విడుతలో 136 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. దస్తురాబాద్ మండలంలో 13 పంచాయతీలు, 102 వార్డులు, కడెం మండలంలో 29 పంచాయతీలు, 242 వార్డులు, ఖానాపూర్ మండలంలో 25 పంచాయతీలు, 192 వార్డులు, పెంబి మండలంలో 24 పంచాయతీలు, 152 వార్డులు, మామడ మండలంలో 27 పంచాయతీలు, 222 వార్డులు, లక్ష్మణచాంద మండలంలో 18 పంచాయతీలు, 162 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
రెండో విడుతలో 131 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నిర్మల్ గ్రామీణ మండలంలో 20 పంచాయతీలు, 170 వార్డులు, సారంగాపూర్ మండలంలో 32 పంచాయతీలు, 282 పంచాయతీలు, సోన్ మండలంలో 14 పంచాయతీలు, 132 వార్డులు, దిలావర్పూర్ మండలంలో12 పంచాయతీలు, 108 వార్డులు, నర్సాపూర్(జి) మండలంలో 13 పంచాయతీలు, 120 వార్డులు, లోకేశ్వరం మండలంలో 25 పంచాయతీలు, 224 వార్డులు, కుంటాల మండలంలో 15 పంచాయతీలు, 134 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
మూడో విడుతలో 133 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. భైంసా మండలంలో 30 పంచాయతీలు, 258 వార్డులు, ముథోల్ మండలంలో 19 పంచాయతీలు, 166 వార్డులు, తానూర్ మండలంలో 32 పంచాయతీలు, 268 వార్డులు, బాసర మండలంలో 10 పంచాయతీలు, 90 వార్డులు, కుభీర్ మండలంలో42 పంచాయతీలు, 344 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
