నిర్మల్, జూన్ 8(నమస్తే తెలంగాణ) : ఓటర్ల జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా రెండు రోజుల క్రితం అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, నిజమైన ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణలో అర్హులైన ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓట్ల తొలగింపు ప్రక్రియలు చేపట్టనున్నారు. అన్ని సవరించిన తర్వాత కొత్త ఓటర్ల జాబితాను విడుదల చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)కు శ్రీకారం చుట్టింది. ప్రతి 25 ఏళ్లకు ఒకసారి ఎన్నికల సంఘం ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని చేపడుతున్నది. గతేడాది నవంబర్ నుంచే ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను ప్రారంభించగా, ఇప్పటి వరకు 80 శాతం పూర్తయింది. అత్యధికంగా ముథోల్ నియోజకవర్గంలో 80.74శాతం పూర్తికాగా, నిర్మల్ నియోజకవర్గంలో 80.20శాతం, ఖానాపూర్ నియోజకవర్గంలో 78శాతం మ్యాపింగ్ పూర్తయింది.

ప్రతి పోలింగ్ బూత్‌లో 1000-1200 మంది ఓటర్లు ఉండే విధంగా చూసి మ్యాపింగ్ చేస్తారు. ఈ మ్యాపింగ్ ప్రకారం ఆయా బూత్‌స్థాయి అధికారి ఇంటింటికీ వెళ్లి ఓటరు అర్హతలను పరిశీలించి నిర్ధారిస్తారు. 2002కు ముందు పుట్టిన ఓటరు నమోదుపై తండ్రి, కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకుల ధ్రువీకరణలను పరిశీలిస్తారు. ఇందుకోసం 12 ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి చూపించాలి. అలాంటి రుజువులు చూపితేనే ఓటరు జాబితాలో ఓటరుగా కొనసాగుతారు. ఒకవేళ సరైన ధ్రువ పత్రాలు లేకుంటే నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగిస్తారు.
అలాగే రెండు చోట్ల ఓట్లు ఉన్నవారిని, మరణించిన వారి పేర్లను తొలగించడానికి చర్యలు చేపట్టనున్నారు. ఈ నెల 15వ తేదీలోగా 100 శాతం మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసి, ఆ తర్వాత ఇంటింటికీ తిరిగి ఓటర్ల సమగ్ర విచారణ(సవరణ) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు నెల రోజులపాటు ఈ ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగనున్నది. కలెక్టర్‌తోపాటు అడిషనల్ కలెక్టర్, డీఆర్వోలు మ్యాపింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఈఆర్వో, ఏఈఆర్వోలకు అవసరమైన సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
నియోజకవర్గ స్థాయిలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఈఆర్వో)లు పర్యవేక్షిస్తుండగా, మండలాల్లో అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్(ఏఈఆర్వో)లు బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత జూలై 31న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేస్తారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే, వాటిని కూడా సరిచేసి అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.
పార్టీల వారీగా ఏజెంట్ల నియామకం
ఓటర్ల జాబితాల్లో తప్పులు లేకుండా, పారదర్శకతతో రూపొందించేందుకు పోలింగ్ కేంద్రాల వారీగా ఏజెంట్లను నియమించుకునేందుకు ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు అనుమతించింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 925 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 925 మంది బీఎల్వోలు మ్యాపింగ్‌లో పాల్గొన్నారు. అలాగే ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఒక ఏజెంట్ వంతున ఆయా పార్టీలు తమ కార్యకర్తలను నియమించుకున్నాయి. వారి పరిధిలో ఓటరు మ్యాపింగ్, ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై అభ్యంతరాలు, ఓటర్ల తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి తప్పులు, సూచనలు ఉంటే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.
కేటగిరీలవారీగా ఓటర్ల జాబితా