వరంగల్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ నిస్వార్థ పోరాట యోధుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి అని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రతి కదలిక, ప్రతి పోరాటాన్నీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎంతో ముచ్చటపడేవారని తెలిపారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించిన పెద్ది సంస్మరణసభలో హరీశ్‌రావు సోమవారం పాల్గొని నివాళులర్పించిన అనంతరం తనకు పెద్దితో ఉన్నఇరువై ఐదేండ్ల ఉద్యమానుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సంస్మరణ సభలో మాట్లాడుతానని తాను కలలో కూడా అనుకోలేదని ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆనాడు ఉద్యమ సమయంలో నాకు దెబ్బ తగిలితే ఏ దవాఖానలో పెద్ది నన్ను చేర్పించాడో.. అదే హాస్పిటల్లో ఆయనను విగతజీవిగా చూస్తానని కలలో కూడా ఊహించలేదంటూ హరీశ్‌రావు కన్నీటి పర్యంతమయ్యారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గానికి పెద్ది చేసిన సేవలు చిరస్మరణీయమైవని స్మరించుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో నిస్వార్థ్ధంగా పనిచేసిన వారిలో పెద్ది ముందు వరుసలో ఉంటారని వివరించారు. పార్టీ అధినేత ఆలోచనలను ఆచరణలో పెట్టే క్రమంలో పెద్దితో కలిసి తాను చేసిన ఉద్యమ ప్రయాణాన్ని ఈ సందర్భంగా హరీశ్‌రావు వివరించారు. ‘అది మానుకోట అయినా.. రాయినిగూడెం ఘటన అయినా.. పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ ఉపఎన్నిక అయినా.. సందర్భం ఏదైనా సమరశీల వ్యూహం అనుసరించడంలో పెద్దిది ప్రత్యేక ముద్ర’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాయినిగూడెంలో ఆనాటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డిపై కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడిన ఘటనలో పెద్ది బాసట ఉందని గుర్తుచేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి లేని మీటింగ్‌లో.. అదీ నర్సంపేట గడ్డ మీద తాను పాల్గొంటానని ఎప్పుడూ ఊహించలేదని భావోద్వేగానికి లోనయ్యారు.
గోదావరి నీటిని పాకాల ఆయకట్టుకు చేర్చేందుకు పెద్ది సుదర్శన్‌రెడ్డి పడిన తపన అసామాన్యమైనదని హరీశ్‌రావు గుర్తుచేశారు. జిల్లా కేంద్రం కాకపోయినా నర్సంపేటకు మెడికల్ కాలేజీ తెప్పించి, 500 పడకల దవాఖానను సాధించేందుకు పెద్ది ఎంత ఆరాటపడ్డారో తమకు తెలుసని వివరించారు. రామప్ప- పాకాల చెరువుల్లో దేవాదుల నీళ్లను అందించాలని, వాటిని ఎలా తీసుకొని రావచ్చో.. సంపూ ర్ణ అవగాహన, అధ్యయనంతో కేసీఆర్ దగ్గరికి వెళ్లి వివరించారని, పెద్ది అభ్యర్థన మేరకే కేసీఆర్ ఆనాడు దేవాదుల నీటిని పాకాలకు రప్పించిన విషయాన్ని వివరించారు. నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి రెండు పంటలకు పుష్కలమైన నీళ్లు వస్తున్నాయంటే అందుకు కారణం పెద్ది సుదర్శన్రెడ్డేనని స్పష్టం చేశారు.
పెద్ది సంస్మరణ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయా సందర్భాలను గుర్తుచేసే సందర్భంలో గద్గదస్వరంతో మాట్లాడారు. హరీశ్‌రావు కంటిధారను పార్టీ రాష్ట్ర నాయకుడు ఒకరు తుడిచారు. తనూ అనేక పర్యాయాలు కన్నీళ్లను తుడుచుకుంటూనే పెద్దితో తన ప్రయాణ మజిలీని స్మరించుకున్న సమయంలో సంస్మరణ సభా ప్రాంగణం ఉద్వేగానికి లోనయ్యింది. భౌతికంగా పెద్ది లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని పేర్కొన్నారు.. ఆయన కుటుంబానికి, నర్సంపేట ప్రజలకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.