Cancer | క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స మరింత ప్రభావవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఖరీదైన పరీక్షలు, వైద్య సదుపాయాల కొరత కారణంగా అనేక మంది రోగుల్లో వ్యాధి ముదిరిన తర్వాతే క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది. ఈ నేపథ్యంలో కుక్కల అద్భుతమైన వాసన గుర్తించే సామర్థ్యాన్ని కృత్రిమ మేధతో అనుసంధానించి క్యాన్సర్‌ను గుర్తించే చవకైన, శరీరంలో ఎలాంటి జోక్యం లేని పరీక్షను అభివృద్ధి చేసేందుకు బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ప్రయత్నిస్తోంది. బెంగళూరు శివార్లలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో క్లోయీ అనే కుక్కకు మనుషుల శ్వాసలో క్యాన్సర్‌కు సంబంధించిన వాసనలను గుర్తించే శిక్షణ ఇస్తున్నారు. కుక్క శరీరానికి ప్రత్యేకంగా రూపొందించిన త్రీడీ ముద్రిత హెల్మెట్, సెన్సార్లతో కూడిన పరికరాలను అమర్చారు. కుక్క వాసనను గుర్తించే సమయంలో దాని మెదడు కార్యకలాపాలు, శ్వాస, శరీర కదలికలను నమోదు చేసి, వాటిని కృత్రిమ మేధ ద్వారా విశ్లేషించే విధానాన్ని సంస్థ అభివృద్ధి చేస్తోంది.
కుక్కలకు మనుషులతో పోలిస్తే వాసనలను గుర్తించే సామర్థ్యం ఎంతో ఎక్కువగా ఉంటుంది. కుక్కలు దాదాపు 30 కోట్ల వాసన గ్రాహకాలను కలిగి ఉంటే, మనుషుల్లో వాటి సంఖ్య సుమారు 50 లక్షలుగా ఉంటుంది. వ్యాధుల కారణంగా మన శరీరం నుంచి విడుదలయ్యే కొన్ని రసాయనాల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల ప్రత్యేకమైన వాసనలు ఏర్పడవని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన వాసనలను కుక్కలు గుర్తించగలవనే ఆలోచనతో క్యాన్సర్ గుర్తింపుపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ విధానంలో రోగులు కుక్కలను నేరుగా కలవాల్సిన అవసరం ఉండదు. ముందుగా సుమారు 10 నిమిషాల పాటు పత్తితో తయారు చేసిన మాస్క్‌లోకి శ్వాసను వదలాలి. అనంతరం ఆ మాస్క్‌ను ఒక సంచిలో భద్రపరిచి ప్రయోగశాలకు తరలిస్తారు. అక్కడ శిక్షణ పొందిన కుక్కలు ఆ నమూనాలను పరిశీలిస్తాయి.
ఒక గంటలో కుక్కలు వేలసార్లు వాసన పీల్చగలవని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఒక్కోసారి వాసన పీల్చినప్పుడు ఒక్కో నమూనాను పరిశీలించే అవకాశం ఉంటుంది. కుక్క స్పందనను మాత్రమే కాకుండా, దాని మెదడు కార్యకలాపాలు, శ్వాస, శరీర భాష వంటి అంశాలను కూడా సెన్సార్ల ద్వారా నమోదు చేసి సమాచారంగా మార్చడం ఈ విధానంలో కీలకమైన అంశం. కర్ణాటకలోని ఆరు ఆసుపత్రుల్లో 1,500 మందికి పైగా పాల్గొన్న ఓ అధ్యయనాన్ని సంస్థ ఇటీవల నిర్వహించింది. ఏడు ప్రధాన రకాల క్యాన్సర్లను గుర్తించడంలో 90 శాతానికి పైగా కచ్చితత్వాన్ని సాధించినట్లు సంస్థ తెలిపింది. అయితే ఈ ఫలితాలను మరింత పెద్ద సంఖ్యలో వ్యక్తులపై నిర్వహించే అధ్యయనాలతో నిర్ధారించాల్సిన అవసరం ఉందని క్యాన్సర్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ విధానం ప్రారంభ దశలో ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ, దీనిపై తుది నిర్ణయానికి రావడానికి మరింత విస్తృత స్థాయిలో పరిశోధనలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ప్రయోగాత్మక అధ్యయనాల్లో మంచి ఫలితాలు రావడం, వాస్తవ ప్రపంచంలో రోగులకు ఈ సాంకేతికత ఎంతవరకు ఉపయోగపడుతుందనేది వేర్వేరు అంశాలని వారు పేర్కొంటున్నారు.
ఈ సంస్థ వాణిజ్యపరంగా ఈ సాంకేతికతను వచ్చే ఏడాది ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అలా జరిగితే జర్మనీ, ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థల తర్వాత ఈ తరహా సాంకేతికతను వాణిజ్య స్థాయిలో అందించే మూడో సంస్థగా నిలిచే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం పరిశోధన కోసం ప్రభుత్వ వైద్య సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈ సంస్థకు కొన్ని పెట్టుబడి సంస్థల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. క్యాన్సర్‌తో పాటు పార్కిన్సన్స్ వ్యాధి, కోవిడ్ 19 వంటి ఇతర అనారోగ్యాలను కూడా కుక్కలు వాసన ద్వారా గుర్తించగలవని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే వీటిని సాధారణ వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలంటే మరిన్ని శాస్త్రీయ ఆధారాలు, విస్తృత స్థాయి పరీక్షలు అవసరం. ఈ పరిశోధనలో భాగంగా మొత్తం 15 కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. వాటిలో ఎక్కువగా బీగల్ జాతి కుక్కలు ఉండగా, కొన్ని మాలినోయిస్, షెపర్డ్ జాతుల మిశ్రమ కుక్కలు కూడా ఉన్నాయి. కొన్ని కుక్కలను దత్తత ద్వారా తీసుకోగా, మరికొన్నింటిని చట్టబద్ధమైన పెంపకందారుల నుంచి తీసుకున్నారు. అయితే వాసన గుర్తించే సామర్థ్యం, శిక్షణకు అనుకూలత వంటి అంశాలను పరిశీలించిన తర్వాత అత్యుత్తమంగా పనిచేసే కుక్కలను మాత్రమే ఎంపిక చేస్తున్నారు.
కుక్కలకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని స్నిఫ్స్పేస్ గా పిలుస్తున్నారు. అక్కడ మానవ నమూనాలను పరిశీలించేందుకు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. కుక్క సరైన నమూనాను గుర్తించినప్పుడు దానికి ఆహారాన్ని బహుమతిగా అందించే విధానాన్ని ఉపయోగిస్తున్నారు. కుక్కలు ఏదైనా నమూనాను గుర్తించినప్పుడు వాటి స్పందన ఒక్కో రకంగా ఉంటుంది. కొన్ని కుక్కలు నేరుగా బహుమతి వచ్చే పరికరం వద్దకు పరుగెత్తుతుండగా, మరికొన్ని అక్కడే నిలబడటం లేదా ఉత్సాహంతో నమూనాను గోళ్లతో తాకడం వంటివి చేస్తాయి. కుక్కల స్పందన ఏ విధంగా ఉన్నా, వాటి ప్రవర్తనలోని నమూనాలను కృత్రిమ మేధ సాంకేతికత స్థిరంగా విశ్లేషించగలిగితే వ్యాధి గుర్తింపులో ఉపయోగపడే సమాచారాన్ని పొందవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. తక్కువ ఖర్చుతో, సులభంగా నిర్వహించగలిగే ప్రారంభ దశ పరీక్షగా ఈ విధానం భవిష్యత్తులో ఉపయోగపడుతుందా అనేది మరిన్ని పరిశోధనలు, వాస్తవ ప్రపంచ పరీక్షల తర్వాతే స్పష్టమవుతుంది.