ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో బీజేపీ సెగలు పుట్టిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జిల్లాలో ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సొంత పార్టీ నాయకులే అసమ్మతితో ఊగిపోతున్నారు. సన్నిహితులతో చెప్పుకోవడం, అంతర్గత చర్చల్లో అసమ్మతి వ్యక్తం చేశారంటే ఏమో అనుకోవచ్చు. కానీ.. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహిస్తున్న సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా ముఖ్యనాయకులు బాహాటంగానే కాంగ్రెస్ తీరును తప్పుబడుతున్నారు. అది కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఎదుటే సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే అసమ్మతి వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.
మంచిర్యాల, జూన్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలో జూన్ 27వ తేదీన ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ‘సర్’ కార్యక్రమంలో మంత్రి జూపల్లి సమక్షంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అసహనం వ్యక్తం చేశారు. తాను నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, ఆదిలాబాద్‌లో నరేశ్ జాదవ్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నామని, ఆదిలాబాద్‌లో బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిర్మల్‌లో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డిలే అన్ని వ్యవహారాలు చూసుకుంటున్నారంటూ కుండబద్దలు కొట్టారు. ప్రతిపక్ష నాయకులకే ప్రాధాన్యం ఇస్తుండడంతో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని వాపోయారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు మూతి, ముఖం తెలియని వారికి అపాయింట్మెంట్ ఇస్తున్నారని, మంత్రులు అధికారులకు ఫోన్ చేసి చెప్పే ముందు స్థానిక డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడగాలని సూచించారు. చివరకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరులోనూ మంత్రి చెప్పిన వారికే ఇచ్చామని అధికారులు చెప్తున్నారని, ఇలాంటి పరిస్థితులపై దృష్టి సారించాలని కోరడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎమ్మెల్యే బొజ్జు వ్యవహారం మరిచిపోక ముందే జూన్ 28వ తేదీన నిర్మల్‌లో నిర్వహించిన సర్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందా? లేక బీజేపీ అధికారంలో ఉందా? అంటూ మంత్రి జూపల్లి ఎదుటే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఒక అధికారిని బదిలీ చేయించలేకపోతున్నామని, కనీసం జరిగిన బదిలీనైనా నిలిపివేయలేకపోతున్నామని వాపోయారు. నాయకులుగా ఇలాంటి అవమానాలు భరించడం కష్టమని, ఇలాంటి పరిస్థితులే కొనసాగితే పార్టీ పదవులకు రాజీనామా చేసి సాధారణ కార్యకర్తలుగా కొనసాగుతామని నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావు కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది.
సీఎం రేవంత్‌రెడ్డి సభలతోనే..
తన దత్తత జిల్లా అని చెప్పుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్‌కు తరచుగా వస్తున్నారు. ఈ క్రమంలో సీఎం వచ్చిన ప్రతిసారి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ సీఎంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అడిగిన వెంటనే ఎయిర్పోర్ట్ ఇచ్చారని.. ఇచ్చిన మాటపై ఉన్నారని, ఆదిలాబాద్‌కు ఏ అవసరం ఉన్నా తీరుస్తామని ప్రధాని మోదీ సమక్షంలో హామీ ఇచ్చారంటూ పాయల్ శంకర్ గతంలో మాట్లాడడం.. 13 ఏండ్ల క్రితం టీడీపీలో ఉన్నప్పుడు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారని, ఇప్పుడు తాను ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో అభివృద్ధికి సహకరించాలంటూ డిసెంబర్ 4, 2025న ఆదిలాబాద్‌లో నిర్వహించిన సభల్లో పాయల్ శంకర్ సీఎం రేవంత్‌రెడ్డిని ఆకాశానికి ఎత్తారు.
ఓ బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రశంసించడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. చనాకా-కొరటా పంప్ హౌజ్ ట్రయల్న్ సందర్భంగా నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో జనవరి 16, 2026న సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్‌శంకర్, మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ నగేశ్ వచ్చి నన్ను కలవడంతోనే ఇక్కడి సమస్యలు దృష్టికి వస్తున్నాయని, ఎర్రబస్సు రాని ఆదిలాబాద్‌కు ఏయిర్ బస్సు వస్తుందంటే దానికి కారణం స్థానిన నాయకులతో ఉన్న కో-ఆర్డినేషనే అంటూ మాట్లాడారు.
దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఇచ్చిన ప్రాధాన్యం సీఎం రేవంత్‌రెడ్డి సహా జిల్లా ఇన్న్ర్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర మంత్రులు, ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న భావన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల్లో పెరుగుతూ వచ్చింది. జిల్లాల్లో బీజేపీ నాయకులకు దక్కిన ప్రియార్టీ తమకు దక్కడం లేదని, బీజేపీ ఎమ్మెల్యేలున్న చోట ఎలాంటి పనుల్లోనూ తమకు ప్రాధాన్యం లేదని ఆ పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ తమ ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ పార్టీ నాయకులకు రాష్ట్రంలో ఇంత ప్రియార్టీ ఇవ్వడంపై ఆ పార్టీ సొంత లీడర్లే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాదా చీకటి దోస్తాన్ అంటూ మండిపడుతున్నారు.
మంచిర్యాల-ఆసిఫాబాద్‌ల్లోనూ అంతర్గత కుమ్ములాటలు
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీజేపీ నాయకులకు ప్రాధాన్యం ఇస్తుండగా.. ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అధికార పార్టీలోని అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. మంత్రి పదవి విషయంలో రాజుకున్న అగ్గి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూర్ ఎమ్మెల్యే మంత్రి వివేక్‌ల మధ్య ఇంకా చల్లారనే లేదు. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క జిల్లాకు వచ్చిన సందర్భంగా.. చెన్నూర్‌లో పెట్టుకున్న కార్యక్రమాలకు హాజరుకాలేదు. అప్పట్లో పీఎస్ఆరే భట్టి టూర్ రద్దుకు కారణమనే చర్చ జరిగింది.
తాజాగా మంచిర్యాల జిల్లాలో భట్టి పర్యటించిన సందర్భంగా.. ఆయన శాఖల మార్పుపై విస్తృతమైన చర్చ జరిగింది. గతంలో తన నియోజకవర్గ టూర్‌ను భట్టి రద్దు చేసుకున్న నేపథ్యంలో.. తాజా పర్యటనకు మంత్రి వివేక్ కావాలనే గైర్హాజరయ్యారన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం మంచిర్యాల పర్యటన ఉన్న రోజే జిల్లా ఇన్న్ర్జి మంత్రి జూపల్లి సైతం ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల్లో పర్యటించారు. మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్ఆర్పై ఉన్న అంతర్గత కుమ్ములాటలతోనే భట్టి టూర్‌కు జిల్లా ఇన్న్ర్జి మంత్రి జూపల్లి, మంత్రి వివేక్ దూరంగా ఉన్నారన్న గుసగుసలు వినిపించాయి. మంచిర్యాల జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల మధ్య కొన్ని రోజులుగా విబేధాలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో ఆసిఫాబాద్ జిల్లాలోనూ వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారింది.
ఆసిఫాబాద్‌లో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్యాం నాయక్, నియోజకవర్గ ఇన్న్ర్జిగా ఉన్న విశ్వప్రసాద్రావులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ మధ్య కాలంలో ఆత్రం సుగుణకు డీసీపీ పదవి ఇచ్చారు. దీంతో మూడోవర్గం తయారవుతున్నట్లుగా కనిపిస్తున్నది. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ దండే విఠల్‌తోపాటు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రావి శ్రీనివాస్ రెండు వర్గాలుగా ఉన్నారు. ఇలా ఆసిఫాబాద్‌లోని రెండు నియోజకవర్గాల్లో వర్గపోరు పార్టీకి తలనొప్పిగా మారింది. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీ గడ్డుకాలంలో కొట్టుమిట్టాడుతున్నది. ఇప్పటికైనా ఈ వ్యవహారాలను అదిష్ఠానం సీరియస్‌గా తీసుకుంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.