ఆదిలాబాద్, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రూ.2 లక్షల రుణమాఫీ గందరగోళంగా మారడంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో రైతు వేదికల్లో ఫిర్యాదుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైంది. నోడల్ అధికారులు రైతు వేదికల్లో అన్నదాతల వద్ద నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆధార్ కార్డు, పట్టా, బ్యాంకు పుస్తకాలతో అధికారులకు దరఖాస్తులు అందజేశారు.
దరఖాస్తులు ఇవ్వడానికి వచ్చి రైతులతో రైతు వేదికలు నిండిపోయాయి. పలు మండలాలకు చెందిన రైతులు తమకు ప్రభుత్వం ఎందుకు రుణమాఫీ చేయలేదంటూ నిలదీశారు. అర్హులుగా ఉన్న తమను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. రుణమాఫీ కాని రైతుల వద్ద నుంచి ఫిర్యాదులు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేసి బ్యాంకులకు పంపిస్తామని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి రైతులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడం రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శమని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ బ్యాంకు లోన్లను రద్దు చేయాలని రైతులు కోరుతున్నారు.
బోథ్, ఆగస్టు 20 : తమకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తింప జేయాలని కోరుతూ మంగళవారం వందలాది మంది రైతులు బోథ్‌లోని రైతువేదిక భవానికి తరలివచ్చారు. రుణమాఫీ వర్తించని రైతుల అనుమానాల నివృత్తి, దరఖాస్తులు స్వీకరించడానికి రైతువేదికల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పొచ్చెర, బోథ్, కౌఠ(బీ), ధన్నూర్(బీ), మర్లపెల్లి, కుచులాపూర్, సోనాల, పాట్నాపూర్, అందుర్ గ్రామా ల నుంచి రుణమాఫీ వర్తించని వందలాది మంది రైతులు వచ్చి దరఖాస్తులు చేసుకున్నా రు. మండల వ్యవసాయాధికారి విశ్వామిత్ర, వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్లవారీగా దరఖాస్తులు స్వీకరించారు.