ఆదిలాబాద్, మార్చి 19(నమస్తే తెలంగాణ) : వానకాలంలో రైతులు పండించిన పత్తి పంటను మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో యార్డుల్లో కొనుగోలు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏ, బీ మార్కెట్ యార్డులు ఉన్నాయి. పత్తిని కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)తోపాటు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన పంటకు సంబంధించిన కమిషన్ను సీసీఐ, వ్యాపారులు మార్కెటింగ్ శాఖకు చెల్లించాలి. కొనుగోళ్ల సమయంలో తేమ శాతం కొలవడానికి, ఆన్లైన్లో రైతుల పంట వివరాలు నమోదు చేయడానికి మార్కెటింగ్ శాఖ అధికారులు యేటా తాత్కాలిక సిబ్బందిని నియమిస్తారు. కొనుగోళ్లు జరిగే కాలానికి రోజు వారిగా మార్కెటింగ్ శాఖ అధికారులు వేతనాలు ఇస్తారు.
గతేడాది వానకాలంలో రైతులు సాగు చేసిన పత్తి కొనుగోళ్లు అక్టోబరు 24న ప్రారంభమై ఈ ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో తేమ కొలిచే సిబ్బంది తొమ్మిది మంది, ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడానికి డాటా ఆపరేటర్లు 10 మందిని మార్కెటింగ్ శాఖ అధికారులు నియమించారు. తేమ కొలిచే వారికి రోజు రూ.569, డాటా ఆపరేటర్లకు రూ.926 చెల్లిస్తారు.
సెలవు రోజులు, మార్కెటింగ్ బంద్ ఉన్నప్పుడు వీరికి వేతనం ఉండదు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు ఫిబ్రవరి 27తో ముగియగా వీరికి మాత్రం నాలుగు నెలల వేతనాలు రాలేదు. తమకు రావాల్సిన జీతం కోసం తేమ సిబ్బంది, డాటా ఆపరేటర్లు రోజు అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదు. పనిచేసిన పైసలు రాకపోవడంతో ఉపాధి కోసం చేసిన అప్పులు తీర్చలేక పోతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి తమ వేతనాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.