లక్ష్మణచాంద, మే 26 : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. వడ్లు మొలకెత్తగా.. కేంద్రాలు చిత్తడి చిత్తడిగా మారాయి. ఆరబెట్టుకోవడానికి కూడా స్థలం లేదు. పార్ పెల్లిలో ఇప్పటికీ కనీసం 50 శాతం ధాన్యం కూడా ప్రభుత్వం సేకరించలేదు. 20 రోజుల క్రితం రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. కానీ.. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం తో మొలకెత్తింది. బూజు కూడా వచ్చిందని రైతులు వాపోతున్నారు.
మండలంలో 12,500 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఒక సన్నరకం, 11 దొడ్డు రకం కొనుగోలు కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటివరకు 90 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కాగా బాబాపూర్ కొనుగోలు కేంద్రం నుంచి ఇటీవల తరలించిన ధాన్యంలో 64 బస్తాలు తడిశాయని సోమవారం రైస్‌మిల్లర్లు తిప్పి పంపినట్లు రైతులు పేర్కొంటున్నారు.
బిచ్చగాళ్లలా చూస్తున్నరు..
ఆరుగాలం కష్టపడి పంటను కేంద్రాలకు తీసుకొస్తే బిచ్చగాళ్లలా చూస్తున్నారు. నేను 18 రోజుల క్రింద వడ్లు తీసుకొచ్చా. అప్పటి నుంచి సంచులు ఇవ్వాలని బతిమిలాడిన ఇవ్వలేదు. చివరికి వర్షాలు కురియడంతో ఎండిన ధాన్యం కూడా మొలకలు వచ్చింది. ఎందుకు సంచులు ఇస్తలేరు అంటే బెదిరిస్తున్నరు. ప్రైవేటులో అమ్ముకుంటే ఇప్పటికీ పైసలు కూడా వచ్చేవి. ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఉన్న వడ్లకు బూజు కూడా వచ్చింది.
– మెరుగు ఎర్రన్న, పార్పెల్లి, లక్ష్మణచాంద మండలం
నింపిన బ్యాగులను ఖాళీ చేయ మంటున్నరు
నాకున్న ఏడెకరాల్లో వరి వేశా. 11 ట్రాక్టర్ల ధాన్యం వచ్చింది. ఐదు ట్రాక్టర్ల ధాన్యానికి 200 సంచులను వారం రోజుల కింద ఇచ్చారు. మిగతా వడ్లకు సంచులు ఇవ్వడం లేదు. వారం రోజుల కింద 200 సంచులు నింపాం. కానీ.. ప్రభుత్వం తీసుకపోలేదు. అంతలో వర్షాలు వచ్చాయి. తడిచి పోవడంతో మొలకలు వచ్చాయి. బూజు పడుతున్నాయి. నింపిన బ్యాగులు ఖాళీ చేయమంటున్నరు. నాకు బోధకాలు ఉంది. మరో 250 బస్తాల ధాన్యం తడిచింది. ధాన్యం మొత్తం తడిచి మొలకలు వస్తున్నాయి. ఎవరు పట్టించుకోవడం లేదు.
– దావ ఎర్రన్న, పార్పెల్లి, లక్ష్మణచాంద మండలం