ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 మున్సిపాలిటీలతో పాటు మంచిర్యాల కార్పొరేషన్లో శుక్రవారం నామినేషన్ల జాతర కనిపించింది. కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు చివరి రోజైన శుక్రవారం డప్పుచప్పుళ్ల నడుమ మద్దతుదారులతో ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్లు వేశారు. మంచిర్యాల పట్టణంలో పాత మంచిర్యాల, చున్నంబట్టి వాడ, కాలేజీ రోడ్డు, బైపాస్ రోడ్డు ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ర్యాలీలు తీశారు. పాత మంచిర్యాల 14, 50 డివిజన్లలో నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. చెన్నూర్ మున్సిపాలిటీతో పాటు క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలోనూ పలు వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ర్యాలీగా వెళ్లారు. బెల్లంపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీ ల్లోనూ చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలీటీల్లో నామినేషన్ల కోలాహలం కనిపించింది. నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చివరి రోజు పెద్దమొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి.
– మంచిర్యాల, జనవరి 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి

మంచిర్యాల మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కీలకంగా మారాయి. మొత్తం 60 డివిజన్లు ఉండగా గురువారం నాటికి 147 మంది నామినేషన్లు వేశారు. బెల్లంపల్లిలో 34 డివిజన్లకు 85 మంది, చెన్నూర్‌లో 18 వార్డులకు 26 మంది, క్యాతన్‌పల్లిలో 22 వార్డులకు 32 మంది, లక్షెట్టిపేటలో 15 వార్డులకు 26 మంది నామినేషన్లు వేశారు. ఇవి గురువారం నాటికి పడిన నామినేషన్లు కాగా శుక్రవారం చివరి రోజు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్లో తమ డివిజన్ తొలి కార్పొరేటర్ అనిపించుకోడానికి పోటీ పెరిగింది. ప్రధాన పార్టీల నుంచి టికెట్ ఆశించి, భంగపడిన నాయకులు చాలా మంది రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. కాగా ఇతర మున్సిపాలిటీల్లో ఏ పార్టీ నుంచి ఎవరి అభ్యర్థి అన్న క్లారిటీ ఇంకా రాలేదు. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఏ డివిజన్, ఏ వార్డులో ఎవరు పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు అభ్యర్థిగా ఉన్నారన్న చర్చ క్షేత్రస్థాయిలో జోరుగా సాగున్నది.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జోరు స్పష్టంగా కనిపిస్తున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరుస చేరికలతో కారు పార్టీ స్పీడ్ పెంచింది. అధికార పార్టీ కాంగ్రెస్ సహా, బీజేపీ నుంచి వలసలు పెరిగాయి. మంచిర్యాల జిల్లాలో మూలరాజిరెడ్డి సహా చెన్నూర్‌లోని ఆయన సహచరులందరూ హస్తం పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. మంచిర్యాలలో ఎమ్మెల్యేకు ఆప్తుడిగా పేరున్న అబ్దుల్ సత్తార్, గుడిపేట మాజీ ఎంపీటీసీ బాలరాజు, నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియాలోని కీలక నాయకులందరూ ఇటీవలే కారెక్కారు. నిర్మల్ జిల్లాలోనూ బీజేపీ పార్టీ నుంచి కీలక నాయకులు బీఆర్ఎస్లో చేశారు.
బెల్లంపల్లి, ఆదిలాబాద్, ఖానాపూర్, కాగజ్‌నగర్.. ఇలా ఏ మున్సిపాలిటీ తీసుకున్నా ఇటీవల కాలంలో బీఆర్ఎస్లో చేరికలు బాగా పెరిగాయి. మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నాయకులు చేరడంతో బీఆర్ఎస్లో జోష్ పెరిగింది. ఇది ఇతర పార్టీలకు ఇబ్బందిగా మారింది. ఇటీవల వచ్చిన ఇంటెలీజెన్స్ రిపోర్ట్‌లోనూ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎక్కువ మున్సిపాలిటీలు గెలిచే అవకాశముందని తేలినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. కాంగ్రెస్ గెలుస్తుందనుకున్న చాలా ప్రాంతాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పేరు వినిపిస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో అధికార పార్టీ అప్రమత్తమైందన్న చర్చ నడుస్తున్నది.
నిర్మల్ అర్బన్/భైంసా/ఖానాపూర్ టౌన్, జనవరి 30 : నిర్మల్ జిల్లాల్లోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో మూడో రోజూ నామినేషన్లు వెల్లువలా వచ్చాయి. శుక్రవారం రాత్రి వరకూ నామినేషన్ కేంద్రాలు అభ్యర్థులు, అనుచరులతో కిటకిటలాడాయి. నిర్మల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అభ్యర్థులకు బీ ఫారాలు అందించింది. మిగతా పార్టీల నేతలు బీ ఫాం లేకుండానే కొందరు నామినేషన్లను వేశారు. నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నిర్మల్ పట్టణంలోని 42 వార్డులకు గాను తొలిరోజు 0, రెండో రోజూ 65 నామినేషన్లు, చివరి రోజు శుక్రవారం 260 నామినేషన్లు రాగా మొత్తం 365 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. భైంసా మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను మొత్తం 202 నామినేషన్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి 15, బీజేపీ నుంచి 46, కాంగ్రెస్ పార్టీ నుంచి 28, ఎంఐఎం నుంచి 53, ఇతర పార్టీల నుంచి 5, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా 55 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను చివరి రోజు 76 నామినేషన్లు రాగా ఈ మూడు రోజుల్లో 102 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.