సహజ అందాలకు నెలవైన గాంధారి వనంలో అతిపెద్ద కేసీఆర్ అర్బన్ పార్క్ ఏర్పాటు కాబోతున్నది. హైదరాబాద్‌లోని శిల్పారామం తరహాలో 250 ఎకరాల్లో కళ్లు చెదిరేలా నిర్మించేందుకు కసరత్తు మొదలైంది. రూ. 20 కోట్లతో టూరిజం హబ్‌గా మార్చనుండగా, ఈ విషయమై విప్ బాల్క సుమన్ ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కాటేజ్‌లు, ఫుడ్ కోర్టులు, క్రాఫ్ట్ స్టాల్స్, క్రాఫ్ట్ వర్క్ షాప్, కల్చరల్ మ్యూజియం, బోటింగ్, వాచ్ టవర్ తదితర నిర్మాణాల డిజైన్లను ఫైనల్ చేయడంపై చర్చించినట్లు తెలిసింది. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించే అవకాశముండగా, ప్రకృతి ప్రేమికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– మంచిర్యాల, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఓ వైపు సింగరేణి బొగ్గు గనులు.. మరో వైపు సిమెంట్ ఫ్యాక్టరీలు.. మంచిర్యాల జిల్లా కీర్తికిరీటంలో స్థిరస్థాయిగా నిలిచాయి. ఈ రెండింటి సరసన మరో కలుకితురాయి చేరబోతున్నది. అదే చెన్నూర్ నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోగల గాంధారి వనం. ఈ వనంలోని 250 ఎకరాల్లో తెలంగాణలోనే అతిపెద్ద ‘కేసీఆర్ అర్బన్ పార్క్’ను కళ్లు చెదిరేలా నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇటీవల పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన శిల్పారామం తరహాలోనే గాంధారీ వనాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని వాగ్ధానం చేశారు. ఈ మేరకు దాదాపు రూ.20 కోట్లతో గాంధారీ వనాన్ని టూరిజం హబ్‌గా మార్చనున్నారు. ఈ పార్క్‌లో కన్వెన్షన్ సెంటర్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కాటేజ్‌లు, ఫుడ్ కోర్టులు, క్రాఫ్ట్ స్టాల్స్, క్రాఫ్ట్ వర్క్ షాప్, కల్చరర్ మ్యూజియం, బోటింగ్, వాచ్ టవర్ తదితర నిర్మాణాలు చేసేందుకు అవసరమైన డిజైన్లను ఫైనల్ చేసే పనిలో టూరిజం, అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో అధికారులతో సమీక్ష సైతం నిర్వహించారు.
మంచిర్యాల జిల్లాలో నాన్ పొల్యూటెడ్ ఏరియా అనగానే గుర్తుకు వచ్చే ప్రదేశంగా గాంధారి వనానికి గుర్తింపు ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చాలా మంది జిల్లా కేంద్రం నుంచి ఇక్కడికి వచ్చి వ్యాయామం, వాకింగ్, జాగింగ్ చేస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లోనైతే పార్క్‌లో సేదతీరేందుకు వందలాది మంది కుటుంబాలతో సహా వస్తుంటారు. వన్యప్రాణులు, పక్షులు, నీటి కొలను ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో అద్భుతాలకు నిలయం ఈ వనం. మహారాష్ట్ర, హైదరాబాద్ నేషనల్ హైవే 363 పక్కనే ఉండడం, ఇక్కడి నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రఖ్యాతి గాంచిన గాంధారి మైసమ్మ ఆలయం ఉండడంతో ఎప్పుడు చూసినా సందర్శకులతో కళకళలాడుతుంటుంది.
ఈ పార్క్‌తో ఉత్తర తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల ఆదివాసీల ఆరాధ్య దైవంగా గుర్తింపు పొందిన గాంధారి మైసమ్మ జాతరకు మంచి రోజులు రానున్నాయి. ఈ పార్క్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే గాంధారి ఖిల్లా ఉండడంతో అది సైతం పర్యాటకంగా వెలిగిపోయే అవకాశం ఉంది. చరిత్రాత్మకంగా, శిల్పకళా నైపుణ్య పరంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ గాంధారి ఖిల్లా మైసమ్మ గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదు. ఖిల్లాకు వెళ్లాలంటే మోకాలులోపు బురదలో కష్టపడాల్సిన దుస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రంలో గాంధారి మైసమ్మ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. బొక్కలగుట్ట నుంచి మైసమ్మ తల్లి ఆలయం వరకు రూ.2.10 కోట్ల నిధులు కేటాయించి రోడ్డు ఏర్పాటు చేసింది. బొక్కలగుట్ట వాగుపై రూ.3.86 కోట్లతో బ్రిడ్జితో పాటు చెక్ డ్యామ్ నిర్మించారు. దాదారు రూ.20 లక్షలతో దర్బార్ కోసంప్రత్యేక షెడ్డు, జాతరకు వచ్చే వారి కోసం వసతులు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు రానుంది. కేసీఆర్ అర్బన్ పార్క్ పనులకు త్వరలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు మందమర్రిలో రూ.500 కోట్లతో ఏర్పాటు చేయనున్న పామాయిల్ ఫ్యాక్టరీ, క్యాతన్‌పల్లి స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్ పనులు, 1200 మందికి సింగరేణి పట్టాల పంపిణీ సహా ఇతర కార్యక్రమాల కోసం మంత్రి జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఈ లోగా అర్బన్ పార్క్‌లో చేయాల్సిన అభివృద్ధి పనులపై నమూనా డిజైన్లను ఫైనల్ చేయడంపై దృష్టి సారించారు.