మంచిర్యాల, మార్చి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంత్రివర్గ విస్తరణ అంశం ఇప్పుడు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. మా సార్కే మంత్రి పదవి వస్తుందంటే.. లేదు.. మా సార్కే వస్తుందంటూ ఏ వర్గం ఎమ్మెల్యే అనుచరులు.. ఆ ఎమ్మెల్యే పేరు ప్రచారం చేస్తున్నారు. ఏడాదిన్నరగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రివర్గ విస్తరణ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో ఆరుగురికి మంత్రి పదవులు ఇస్తారని.. వీటిలో నాలుగు ఇప్పటికే ఫైనల్ అయిపోయాయని చెబుతున్నారు. మరో రెండు మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు. హోల్డ్‌లో పెడతారా.. లేకపోతే వాటినీ భర్తీ చేస్తారా.. భర్తీ చేస్తే ఎవరికి మంత్రి పదవి వస్తుందన్న విషయంలో ఊహాగానాలు అధికమైపోయాయి.
మంచిర్యాల జిల్లా నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే పేరు దాదాపు ఖాయమైపోయినట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముందు నుంచి హస్తం పార్టీని పట్టుకొనే ఉన్నా మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్, ఆయన అనుచరుల భవిష్యత్తు ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికీ మా సార్కే మంత్రి పదవి వస్తుందంటూ మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరులు చెప్పుకొస్తున్నారు. మరోవైపు మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖరారైపోయిందని వివేక్ వర్గం చెప్పుకుంటుంది. ఇకపోతే బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేను కలుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి రేస్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్నది.
మంత్రి పదవి విషయంలో ఏ మాత్రం అటూ.. ఇటైనా మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి తిరుగుబాటు తప్పేలా లేదు. ఇటు పీఎస్సార్‌కు.. అటు గడ్డం బ్రదర్స్‌లో ఒక్కరికి ఇస్తే జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. లేదా అసలు జిల్లాలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వకున్నా పర్లేదు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోలేమని ఆ పార్టీ నాయకులే చెప్పడం గమనార్హం. ఒకవేళ వివేక్‌కు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన పీఎస్సార్‌కు అన్యాయం చేసినట్లే అవుతుంది. గతంలో పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో పార్టీ వ్యవహార శైలిపై ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. పరిస్థితులు మారకపోతే ఇందిరా కాంగ్రెస్ పార్టీ పెడతానంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారు. అదయ్యాక రేవంత్ ఇంద్రవెల్లి పర్యటనతో పార్టీలో కొంత సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే మినిస్టర్ అవుతాననే ధీమాలో ఉన్నారు.
మరోవైపు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబుకు అత్యంత సన్నిహితుడిగా పీఎస్సార్‌కు పేరు ఉంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా కచ్చితంగా పదవి వస్తుందంటూ అధిష్టానం నుంచి సైతం చెప్పారనే టాక్ అప్పట్లో వినిపించింది. గతంలో భట్టి పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు పీఎస్సార్ సేవలను పార్టీ గుర్తించిందని, ఆయన నాయకత్వంపై విశ్వాసం ఉందని చెప్పారు. దీంతో మంత్రి పదవి పీఎస్సార్‌కే అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో సమీకరణలు మారి వివేక్‌కు పదవి వస్తే పీఎస్సార్ భవితవ్యం ఏమిటి.. అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి బుజ్జగించాలని చూస్తున్నట్లు సైతం చర్చ నడుస్తున్నది. కానీ, దానికి ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. ప్రాధాన్యత తగ్గితే ఊరుకునే పరిస్థితి కనిపించడం లేదు. వివేక్‌కే మంత్రి పదవి ఇస్తే జిల్లా కాంగ్రెస్ పార్టీలో అది పెద్ద కుదుపు తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తున్నప్పటికీ.. ఎన్నికలకు ముందే పార్టీలోకి వచ్చిన ఆయనకు పదవి ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని మరో ఎమ్మెల్యే వర్గం స్పష్టం చేస్తున్నది. ఒకవేళ ఎస్సీలకు పదవి ఇవ్వాలనుకుంటే మాల సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్క ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న నేపథ్యంలో.. మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ సైతం వినిపిస్తున్నది. కానీ, ఢిల్లీ స్థాయిలో మంత్రి పదవి కోసం పైరవీలు నడుస్తున్నాయని, గతంలో ఇచ్చిన హామీ నేపథ్యంలో తప్పకుండా వస్తుందని ప్రచారం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు ఇవ్వడాన్ని పీఎస్సార్ వ్యతిరేకించారు. ఆ కోపం పీఎస్సార్‌పై ఇంకా సీఎంకు ఉందనే చర్చ జిల్లాలో నడుస్తున్నది. అందుకే పీఎస్సార్‌కు ప్రత్యామ్నాయంగా వివేక్‌ను మంచిర్యాల జిల్లాలో ప్రోత్సాహిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సహా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఏ మీటింగ్‌కు వచ్చినా సీఎం రేవంత్‌రెడ్డి కాక కుటుంబాన్ని ప్రశంసిస్తూ మాట్లాడానికి ఇదే కారణమని తెలుస్తున్నది. ఇన్ని రోజులు మాల సామాజిక వర్గాన్ని అసలు పట్టించుకోని వివేక్‌కు ఒక్కసారిగా ఆ సామాజిక వర్గంపై ప్రేమ పుట్టుకురావడానికి వెనుక సైతం సీఎం, పార్టీ పెద్దల హస్తం ఉందనే ప్రచారం ఇప్పుడు నడుస్తున్నది. పథకం ప్రకారం వివేక్‌ను అధిష్ఠానం ముందు బలంగా చూపించడంలో భాగంగానే రెండు తెలుగు రాష్ర్టాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే పీఎస్సార్ మంత్రి పదవి ఆశలు గల్లంతైనట్లేనని పలువరు విశ్లేషిస్తున్నారు.
ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లు ఉంది మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి. మంత్రి పదవి విషయంలో ఎమ్మెల్యేల మధ్య పోటీ తలనొప్పిగా మారింది. ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా జిల్లా కాంగ్రెస్‌లో క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పార్టీ వ్యవహారాల విషయంలో అటు పీఎస్సార్‌కు.. ఇటు వివేక్‌కు పొసగకపోవచ్చు. డీసీసీ అధ్యక్షురాలిగా పీఎస్సార్ భార్య సురేఖ ఉన్నారు. స్థానికసంస్థల ఎన్నికలు దగ్గర్లో ఉన్నాయి.
ఒకవేళ వివేక్‌కు మంత్రి పదవి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయించే విషయంలో పీఎస్సార్ కాంప్రమేజ్ కాకపోవచ్చు. ముందు నుంచి పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తే వివేక్‌ను నమ్ముకొని పార్టీలో చేరిన వారికి ఇబ్బందులు తప్పవు. ఒకవేళ పీఎస్సార్‌కు మంత్రి పదవి వస్తే వివేక్ వర్గం మొత్తానికే నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. మంత్రి పదవితో జిల్లా కాంగ్రెస్ పార్టీకి జరిగే మేలు కంటే.. నష్టమే ఎక్కువని పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు. ఒకరికి పదవి ఇచ్చి, మరొకరికి ఇవ్వకపోతే ఇద్దరి మధ్య తాము నలిగిపోవాల్సి వస్తుందని భయపడిపోతున్నారు.